దాట్లలో భారీ అగ్నిప్రమాదం..

దాట్లలో భారీ అగ్నిప్రమాదం..

గడ్డివాములు బూడిద

అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

మహబూబాబాద్, ఆంధ్రప్రభ: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగలడంతో నిప్పురవ్వలు పడి, కోత పూర్తైన పొలాల్లో ఉన్న ఎండుగడ్డి, గడ్డివాములకు మంటలు అంటుకున్నాయి.

గాలివేగం అధికంగా ఉండటంతో మంటలు ఒక పొలం నుంచి మరొక పొలానికి వేగంగా వ్యాపించాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అగ్నిమాపక శాఖ, పోలీసు, విద్యుత్ శాఖ అధికారులకు పలుమార్లు ఫోన్లు చేసినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని గ్రామస్తులు ఆరోపించారు. 101 నంబర్ పనిచేయలేదని, 100కు కాల్ చేసినా పట్టించుకోలేదని వాపోయారు. స్థానిక ఎస్సైకు ఫోన్ చేయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని తెలిపారు.

విద్యుత్ శాఖ అధికారులు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించారని గ్రామస్తులు మండిపడ్డారు. దాదాపు రెండు గంటల పాటు సహాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగానే భారీ నష్టం జరిగిందని ఆరోపించిన గ్రామ ప్రజలు, ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply