హంద్రీ – నీవా జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తాం…
హంద్రీ – నీవా జలాలతో జిల్లాను సస్యశ్యామలం చేస్తాం…
శ్రీశైలం మల్లన్న జలాలతో తిరుపతి వెంకన్నకు జలహారతి
పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి జిల్లాకు శాశ్వత నీటి భద్రత
చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి జిల్లాకు శాశ్వత నీటి భద్రత కల్పిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. శనివారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి మండలంలో పర్యటించిన ఆయన కండ్రిగ గ్రామంలో సంజీవని ప్రాజెక్టును జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ చిత్తూరు జిల్లా భవిష్యత్తుకు కీలకమైన సాగునీరు, తాగునీటి ప్రాజెక్టులపై పలు ముఖ్యమైన ప్రకటనలు చేశారు. చిత్తూరు జిల్లా ఎప్పటి నుంచో నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని సీఎం పేర్కొన్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు. హంద్రీ – నీవా జలాలను ఈ సంవత్సరంలోనే చిత్తూరు జిల్లాకు తీసుకువస్తామని స్పష్టం చేశారు.

ఆ నీటిని నీవా నదితో అనుసంధానం చేసి పూతలపట్టు నియోజకవర్గంతో పాటు మొత్తం చిత్తూరు జిల్లాకు తాగునీరు, సాగునీరు అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. హంద్రీ – నీవా ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అమలైతే రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు అన్నారు. నీరు లేక రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం బాగా అర్థం చేసుకుందని, సాగునీటి వసతి పెరిగితే రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు. భూగర్భ జలాలు పడిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పరిస్థితిని మార్చేందుకు నదుల అనుసంధానం కీలకమని పేర్కొన్నారు. శ్రీశైలం మల్లన్న నుంచి కృష్ణా జలాలను తీసుకువచ్చి కళ్యాణి డ్యామ్‌ను నింపుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ నీటితో తిరుపతి, తిరుమలకు శాశ్వత తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

పవిత్ర పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం మల్లన్నను తిరుపతి వెంకన్నతో పవిత్ర జలాల ద్వారా అనుసంధానం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇది కేవలం నీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, రెండు పవిత్ర క్షేత్రాలను కలిపే ఆధ్యాత్మిక కార్యక్రమమని వ్యాఖ్యానించారు. తిరుపతి నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, యాత్రికుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోందని సీఎం చెప్పారు. భవిష్యత్తులో తాగునీటి అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే శాశ్వత ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. కళ్యాణి డ్యామ్ నిండితే తిరుపతి ప్రాంతానికి పెద్ద ఊరటనిస్తుందని అన్నారు. భూమిని జలాశయంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వర్షపు నీరు వృథా కాకుండా చెరువులు, కాలువలు, జలాశయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నీటి సంరక్షణ లేకుండా భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గాలేరు – నగరి జలాలను కోడూరు వరకు తీసుకువస్తున్నామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే జిల్లాలోని అనేక మండలాలకు సాగునీటి సౌకర్యం లభిస్తుందని చెప్పారు. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నీటి కొరత కారణంగా రైతులు వలస వెళ్లే పరిస్థితులు మారాలని, వ్యవసాయం లాభదాయకంగా మారాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మల్లెమడుగు ప్రాజెక్టును 2025 సంవత్సరానికల్లా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గతంలో నీటి ప్రాజెక్టులు రాజకీయాలకే పరిమితమయ్యాయని, ఇప్పుడు వాటిని ప్రజల జీవితాలను మార్చే అభివృద్ధి కార్యక్రమాలుగా తీసుకెళ్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
నీరు ఉంటేనే రైతు బతుకుతాడని, రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సాగునీరు కీలకమని చెప్పారు. చిత్తూరు జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని సీఎం వెల్లడించారు. జన ద్వారా జలహారతి కార్యక్రమం కింద జిల్లాలోని చెరువులను అభివృద్ధి చేసి భూగర్భ జలాలను పెంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో చెరువులు నిండితే భూగర్భ జలాలు పెరుగుతాయని, తాగునీటి సమస్య కూడా తగ్గుతుందని వివరించారు. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం మాత్రమే కాదు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వర్షపు నీటి నిల్వపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
చెరువులు, కుంటలు, కాలువలను పరిరక్షిస్తే భవిష్యత్ తరాలకు నీటి కొరత ఉండదని పేర్కొన్నారు. రాయలసీమను కరవు ప్రాంతం అనే ముద్ర నుంచి బయటకు తీసుకురావడమే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. నీటి ప్రాజెక్టులు పూర్తయితే వ్యవసాయం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని చెప్పారు. చిత్తూరు జిల్లాను నీటి సంపదతో కళకళలాడే జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలు జిల్లాలోని రైతుల్లో కొత్త ఆశలు నింపాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులపై స్పష్టమైన హామీలు రావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాకు సాగునీరు, తాగునీటి రంగంలో ఇది కీలక మలుపుగా మారనుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు పార్లమెంటు సభ్యుడు దగ్గు మల్ల ప్రసాదరావు, పూతలపట్టు శాసనసభ్యులు, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, సంజీవిని ప్రాజెక్ట్ సీఈఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
