సమస్యలు పరిష్కరించండి
సమస్యలు పరిష్కరించండి
సైబరాబాద్ మునిసిపల్ కమిషనర్‌కు వినతి
మేడ్చల్, మే 23 (ఆంధ్రప్రభ ): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని పలు వార్డుల్లో పౌర వసతులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మేడ్చల్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని పలు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయన శనివారం రోజు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు అధికారిక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీలో నెలకొన్న పలు ప్రధాన సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆరు నెలలుగా గుంతలమయంగా రహదారులు
మున్సిపాలిటీలోని 297వ డివిజన్ పరిధిలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని పేర్కొన్నారు. మేడ్చల్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ నుండి గ్రంథాలయం వరకు డ్రైనేజీ పైప్‌లైన్ పనుల కోసం దాదాపు ఆరు నెలల క్రితం రోడ్డును తవ్వారని, పనులు పూర్తయినా ఇంతవరకు తిరిగి రోడ్డు వేయలేదని మండిపడ్డారు. సుమారు 300 మీటర్ల పొడవున్న ఈ రహదారి గుండా నిత్యం వేలాది మంది ప్రజలు, వాహనదారులు ప్రయాణిస్తుంటారని రోడ్డుపై ఏర్పడిన పెద్ద పెద్ద గుంతల వల్ల ప్రయాణం ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ దేవేందర్ రెడ్డి ఇల్లు నుండి ముదిరాజ్ సంఘం వరకు ఉన్న సుమారు 250 మీటర్ల రహదారి కూడా పూర్తిగా దెబ్బతిని, ప్రజలు నడవడానికి కూడా వీలు లేని విధంగా తయారైందని వివరించారు.
పట్టణంలోని పలు కాలనీల్లో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా లోపించిందని వినతిపత్రంలో పేర్కొన్నారు. చెత్త సేకరించే మున్సిపల్ వాహనాలు (చెత్త బండ్లు) క్రమబద్ధంగా కాలనీల్లోకి రాకపోవడం వల్ల కాలనీవాసులు చెత్తను ఎక్కడపడితే అక్కడ పారబోయాల్సి వస్తోందని, దీనివల్ల పరిసరాలు కలుషితమై రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా, పలు కాలనీల్లో వీధి దీపాలు (స్ట్రీట్ లైట్లు) వెలగకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు చీకట్లోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కమిషనర్ దృష్టికి తెచ్చారు.
ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని ఆయన కోరారు. కొన్ని కాలనీల్లో బోర్ వెల్ పంపులు, చేతి పంపులు పనిచేయడం లేదని, వాటికి వెంటనే మరమ్మతులు చేయించడంతో పాటు ఎండల తీవ్రత దృష్ట్యా అదనంగా మరో రెండు హ్యాండ్ పంపులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు పట్టణంలోని పలు కాలనీల్లో అంతర్గత సి.సి రోడ్లపై ఏర్పడిన గుంతలకు వెంటనే ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేసి, ప్రజల రవాణా ఇబ్బందులను తొలగించాలని చీర్ల రమేష్ కమిషనర్‌ను కోరడం జరిగింది.
