చెడ్డి గ్యాంగ్ అని నిర్ధారించలేం

చెడ్డి గ్యాంగ్ అని నిర్ధారించలేం
- ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేసి జల్లెడ పడుతున్నాం
- ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
ఒంగోలు క్రైం, ఆంధ్రప్రభ : చెడ్డి గ్యాంగ్ ఒంగోలులో సంచరిస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు స్పందించారు. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందుర్తి నగర్ లో చెడ్డి గ్యాంగ్ సంచరిస్తున్నట్లు ఒక ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలు రికార్డు చేశాయి. దీనిపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నగరంలో అపరిచిత వ్యక్తులు చెడ్డీలు వేసుకొని ముఖాలకు మాస్కులు ధరించి సంచరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ వీడియోలో ఆరుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు.
వారిని చెడ్డి గ్యాంగ్ అని నిర్ధారించలేమని స్పష్టం చేశారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. నగరంలో డార్మెటరీలు లాడ్జిలు, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని అన్నారు. నగరంలోకి ప్రవేశించిన ఆ గ్యాంగ్ ని త్వరలో పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచిలంగా మారిన చెడ్డి గ్యాంగ్ గురించి ప్రస్తుతం తమ దగ్గర ఎలాంటి సమాచారం లేదని ఒంగోలులో ప్రవేశించింది వారా కాదా అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. నగర ప్రజలు వారి విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీస్ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా అందించారు. అపరిచిత వ్యక్తుల కదలికలు ఎవరైనా గమనిస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు.
