పెట్టుబ‌డిదారుల‌కు అండ‌గా ఇన్వెస్ట‌ర్స్ డెస్క్

పెట్టుబ‌డిదారుల‌కు అండ‌గా ఇన్వెస్ట‌ర్స్ డెస్క్

-జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌త్యేకంగా ఏర్పాటు
-సింగిల్ విండో సెల్‌తో వేగవంతమైన సేవలు
-పారిశ్రామిక అభివృద్ధికి క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ నూత‌న చొర‌వ‌

విజయవాడ, ఆంధ్రప్రభ:

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తల‌కు అన్ని విధాలా చేయూతనందించేందుకు క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌త్యేకంగా ఇన్వెస్ట‌ర్స్ డెస్క్‌ను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు.
ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌నతో స్థానిక యువ‌తకు విస్తృత ఉపాధి అవ‌కాశాలు అందుబాటులోకి రావ‌డంతో పాటు ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌డ‌తాయ‌ని, స్థానిక వ‌న‌రుల వినియోగ సామ‌ర్థ్య‌మూ మెరుగుప‌డి సుస్థిర అభివృద్ధికి వీల‌వుతుంద‌ని పేర్కొన్నారు.

క‌లెక్ట‌రేట్ శ్రీ ఏవీఎస్ రెడ్డి హాల్‌లోని ఇన్వెస్ట‌ర్స్ డెస్క్ – సింగిల్ విండో సెల్ ద్వారా ఔత్సాహికుల‌కు అన్ని విధాలా చేయూతనందించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. ఈ డెస్క్ ద్వారా పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపనకు అవ‌స‌ర‌మైన అనుమతులు, లైసెన్సులు, శాఖల సమన్వయం వంటి అంశాలలో సులభతర సేవలు అందించడంతో పాటు, వివిధ రకాల సేవలకు మార్గనిర్దేశనం చేయడం జరుగుతుందన్నారు.

ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న వివిధ ప‌థ‌కాలు, ప్రోత్సాహ‌కాలు వంటి స‌మాచారాన్ని అందించ‌డంతో పాటు పారిశ్రామిక యూనిట్ల‌ను విజ‌య‌వంతంగా న‌డిపించేందుకు మార్గ‌ద‌ర్శ‌నం ల‌భిస్తుంద‌ని వివ‌రించారు. ప‌రిశ్ర‌మ‌లు న‌డ‌ప‌టంలో ఏవైనా స‌మ‌స్య‌లు ఉత్ప‌న్న‌మైతే వాటి ప‌రిష్కారానికీ చేయిప‌ట్టి న‌డిపించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

జిల్లాలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తూ, కొత్త పరిశ్రమల స్థాపనకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. జిల్లాలో పరిశ్రమలు స్థాపించాల‌నుకునే పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలకు అనువైన, అవసరమైన భూమిని స‌మ‌కూర్చ‌డానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంద‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ పేర్కొన్నారు. మ‌రిన్ని వివ‌రాల‌కు డీఐసీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ ఎం.మ‌ధు (98857 29555), ఇన్వెస్ట‌ర్ డెస్క్ ఇన్‌ఛార్జ్ డా. సుమ‌న్ (94943 75951)ను సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని తెలిపారు.

జి.కొండూరులో సీబీజీ ప్లాంటు..

ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లాలో ఐవోసీ-జీపీఎస్ సంస్థ‌చే స్థాపించబోయే కంప్రెస్డ్ బ‌యోగ్యాస్ (సీబీజీ) ప్లాంటు ప్రతిపాదనకు ఆమోదం ల‌భించింద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. ఈ పరిశ్రమ జి.కొండూరు మండలంలోని కడింపోతవరం గ్రామం పరిధిలో రానుంది. ఇందుకు అవ‌స‌ర‌మైన భూమిని ఐవోసీ జీపీఎస్‌కు ఈ సంస్థ మాతృ సంస్థ అయిన ఐవోసీ లిమిటెడ్ త‌న‌కు చెందిన భూమిలో కొంత భూమిని కేటాయిస్తున్నార‌న్నారు. ఈ పరిశ్రమ ద్వారా జిల్లాకు రూ. 120 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రానున్నాయ‌ని.. ఈ పరిశ్రమ ద్వారా 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ వివ‌రించారు.

Leave a Reply