కాళేశ్వరంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు

కాళేశ్వరంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు
- కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక శ్రద్ధ..
- కాళేశ్వరం ఐదు జోన్లుగా విభజన..
- నదీ తీరంలో వ్యర్థాల తొలగింపు
- ఆకర్షణీయమైన హృదయాకార ఇనుప డస్ట్బిన్ల ఏర్పాటు
మహాదేవపూర్, ఆంధ్రప్రభ:
కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగా పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పుష్కరాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక చర్యలు చేపట్టారు. భక్తులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా జిల్లా పరిపాలన యంత్రాంగం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ముందడుగు వేస్తోంది.
పుష్కర ఘాట్లు, నదీ తీర ప్రాంతాలు, ప్రధాన రహదారులు , ఆలయ పరిసర ప్రాంతాల్లో నిరంతరం శుభ్రత పనులు నిర్వహిస్తున్నారు. భక్తులు నదిలో వదిలేస్తున్న వ్యర్థాలను సైతం సిబ్బంది జల్లెడ పట్టి ఎప్పటికప్పుడు తొలగిస్తూ నీటి నాణ్యతను కాపాడుతున్నారు. పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తూ పుష్కర ప్రాంగణాలను అద్దంలా తీర్చిదిద్దుతున్నారు.
ప్రత్యేక పర్యవేక్షణ.. ఐదు జోన్లుగా విభజన:
శుభ్రత పనుల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం ఒక బలమైన పర్యవేక్షణ వ్యవస్థను రంగంలోకి దించింది. పారిశుధ్య పనుల పర్యవేక్షణ కోసం మొత్తం 18 మంది ప్రత్యేక అధికారులను నియమించగా, వారి కింద సుమారు 300 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. పుష్కర ప్రాంతమైన కాళేశ్వరాన్ని ఐదు జోన్లుగా విభజించి, ప్రతి జోన్కు ప్రత్యేక జోనల్ అధికారులను బాధ్యులుగా నియమించారు. ఈ జోనల్ అధికారులు, సూపర్వైజర్లు, పర్యవేక్షక సిబ్బంది, మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నారు.
ఆకట్టుకుంటున్న హృదయాకార డస్ట్బిన్లు:
పుష్కర ఘాట్లు, నదీ తీర ప్రాంతాలు, ప్రధాన కూడళ్ల వద్ద భక్తులు ఎక్కడపడితే అక్కడ చెత్త వేయకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం వినూత్నంగా ఆలోచించింది. భక్తులను ఆకర్షించే విధంగా ప్రత్యేకంగా హృదయాకారంలో (Heart Shape) తయారు చేసిన ఇనుప డస్ట్బిన్లను ముంతలవారీగా అందుబాటులో ఉంచింది.
పుష్కరాలకు విచ్చేస్తున్న భక్తులు పరిశుభ్రమైన వాతావరణంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకునేలా అధికారులు తీసుకుంటున్న ఈ ముందస్తు చర్యలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పారిశుధ్య నిర్వహణలో జిల్లా యంత్రాంగం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధపై భక్తులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
