ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

  • రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు,

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజా పాలనలో నాగర్ కర్నూల్ జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తే జిల్లా అభివృద్ధి వేగంగా జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా కృషి చేసి, నాగర్ కర్నూలు జిల్లాకు రాష్ట్రవ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రజా పాలనను ఆదర్శంగా నిలపాలని మంత్రి ప్రజా ప్రతినిధులు, అధికారులకు పిలుపునిచ్చారు.

శుక్రవారం నాగర్‌ కర్నూల్ జిల్లా జిల్లా కేంద్రంలోని గగ్గలపల్లి తేజ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లాస్థాయి ప్రజా పాలన సమావేశాన్ని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ శాసనమండలి సభ్యులు కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి జిల్లా స్థాయి ప్రజా పాలన సమావేశాన్ని ప్రారంభించారు. ముందుగా తెలంగాణ జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన కార్యక్రమం అనంతరం,జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సీతారాం నాయక్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లాలో మార్చ్ 6 నుంచి అమల చేసిన కార్యక్రమాలపై ఈ అవగాహన సదస్సులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పది అంశాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల పై అధికారులు శాఖల వారీగా తెలియపరిచారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఒక్కొక్కటి అమలు చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని, మహిళల ఆర్థిక అభివృద్ధిని పెంపొందించే విధంగా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అనేక కొత్త పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ఆర్థిక విధానాల కారణంగా రాష్ట్రంపై భారీ అప్పుల భారం పడిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత పదేళ్లలో రూ. 8 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని మంత్రి ఆరోపించారు. ఈ అప్పుల కారణంగా ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 6500 కోట్ల వరకు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. గతంలో 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాల పాలనలో మొత్తం రూ. 65 వేల కోట్ల అప్పులు మాత్రమే చేశారని, కానీ గత ప్రభుత్వం కేవలం పదేళ్ల వ్యవధిలోనే భారీ అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి పెట్టిందని మంత్రి తెలిపారు.

రాష్ట్రం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం ఎలాంటి వెనుకడుగు వేయడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. మహిళల సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొంటూ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించామని తెలిపారు.

అదేవిధంగా, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తూ సామాన్య ప్రజలకు ఊరటనిస్తున్నామని చెప్పారు. పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించేందుకు రూ. 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని మంత్రి తెలిపారు. పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టామని, అర్హులైన కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. గృహరహిత పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా స్వంత ఇల్లు కల కల్పిస్తున్నామని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు రైతు రుణమాఫీ అమలు చేస్తున్నామని, రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.

అదనంగా, సన్న ధాన్యం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని, స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లక్షలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం అహర్నిశలు పనిచేస్తోందని జూపల్లి కృష్ణారావు తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే రెండున్నర సంవత్సరాల్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంను ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంచ్ అనంగా ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.

పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3 వేల 500 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, జూన్ రెండో తేదీన ఒక లక్ష ఇండ్లు గృహప్రవేశాలు జరగనున్నాయని, ముఖ్యమంత్రి అదిలాబాదులో గృహప్రవేశాల కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు మంత్రి తెలిపారు. పాలమూరు ప్రాంతం ఎన్నో దశాబ్దాలుగా సాగునీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. ఈ ప్రాంత రైతుల జీవితాల్లో శాశ్వత మార్పు తీసుకురావాలంటే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కీలకమని పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల పనులు నెమ్మదించాయని ఆయన విమర్శించారు. ఇదే సమయంలో కాలేశ్వరం ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినప్పటికీ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని, కానీ గత పాలకులు పాలమూరు ప్రాంత రైతుల అవసరాలను పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సాగునీటి వనరుల విస్తరణతో పాటు, ఎండబారిన భూములకు నీరు అందించి రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడమే ప్రభుత్వ సంకల్పమని చెప్పారు. పాలమూరు–రంగారెడ్డి పథకం పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, తాగునీటి సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని వివరించారు.

శాసనమండలి సభ్యులు కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా ప్రజాప్రతినిధులు మరియు అధికారులు వారధిగా పని చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు, ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు జిల్లాలోని ప్రతి అర్హుడైన లబ్ధిదారునికి చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ…. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. మార్చి 6వ తేదీ నుంచి జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పాలన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల అమలులో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించారని కలెక్టర్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు జిల్లాలోని వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న సుమారు 5,000 ఫైళ్లను రానున్న 15 రోజుల్లో పూర్తిస్థాయిలో క్లియరెన్స్ చేసే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రతి శాఖ అధికారి పెండింగ్ దరఖాస్తులు, ఫైళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయడం ప్రతి ప్రభుత్వ అధికారుల బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, నిర్దిష్ట గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

“ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాల అమలు మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని ఆయన కోరారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సేవా దృక్పథంతో పనిచేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు సాకారం అవుతాయని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అమరేందర్ దేవ సహాయం, నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి జ్యోతి తదితర ప్రజా ప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply