సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.1000 కోట్లు కేటాయించాలి

సేవాలాల్ ఆలయ నిర్మాణానికి రూ.1000 కోట్లు కేటాయించాలి
- గిరిజన సంఘాల డిమాండ్
తొర్రూరు, ఆంధ్రప్రభ:
హైదరాబాద్‌లో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు కేటాయించాలని ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోత్ బాలు నాయక్, లంబాడా జేఏసీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ ధరావత్ జై సింగ్ నాయక్ డిమాండ్ చేశారు. ఎల్‌హెచ్‌పీఎస్, గిరిజన విద్యార్థి సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తలపెట్టిన ముఖ్యమంత్రి నివాస ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న తొర్రూరు మండల గిరిజన నాయకులను మంగళవారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా బాలునాయక్, జై సింగ్ నాయక్ మాట్లాడుతూ.. బంజారాల ఆరాధ్య దైవం, జాతిని జాగృతం చేసిన మహనీయుడైన సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని అటవీ ప్రాంతంలో కాకుండా హైదరాబాద్ నడిబొడ్డున ప్రతిష్టించాలని ప్రభుత్వాన్ని కోరారు. సేవాలాల్ మహారాజ్ జ్ఞాన మందిర నిర్మాణానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థి సంఘం, లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి బయలుదేరిన బంజారా నాయకులను రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు.
న్యాయబద్ధమైన అంశాలపై శాంతియుత నిరసన తెలియజేయడానికి సిద్ధమైన గిరిజన నాయకులను ముందస్తుగా నిర్బంధించడం దారుణమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బంజారా నాయకుల డిమాండ్లను నెరవేర్చాలని, సంత్ సేవాలాల్ మహారాజ్‌కు సముచిత గౌరవం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
