ఆసక్తి ఉన్నవాళ్లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరండి

ఆసక్తి ఉన్నవాళ్లు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరండి
- జిల్లా ఇంచార్జి లక్ష్మి
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ:
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని శంకర్గూడ గ్రామంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జిల్లా ఇంచార్జి లక్ష్మి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది రైతుల పార్టీ అని, దేశంలో మార్పు కోరుకునేవారు, ఆసక్తి ఉన్నవాళ్లు పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం ద్వారా రైతుల కష్టాలను తీరుస్తామని ఆమె భరోసా ఇచ్చారు.
పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ, రైతులు పండించిన మొక్కజొన్న పంట కొనుగోలులోనూ తీవ్ర జాప్యం జరుగుతోందని లక్ష్మి విమర్శించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, జిల్లా మార్కెట్లలో రైతులకు సకాలంలో బస్తాలు కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతుల పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకే తాము ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని తెలిపారు. తమ ఓట్లతో దేశాన్ని మలుపు తిప్పగల సత్తా ఉన్న రైతాంగం ఇకనైనా మేలుకోవాలని, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది కేవలం ఆమ్ ఆద్మీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తనయుడు విజయ్ కుమార్ జాదవ్, హిరాలాల్, మదినే, నీవర్తి తదితరులు పాల్గొన్నారు.
