స్వర్ణాంధ్ర లక్ష్యంగా హరిత కర్నూలు

స్వర్ణాంధ్ర లక్ష్యంగా హరిత కర్నూలు
-2047 నాటికి 50 శాతం అటవీ విస్తీర్ణమే టార్గెట్
-ఈ ఏడాది జిల్లాలో 45 లక్షల మొక్కల నాటడం
-శాఖల వారీగా లక్ష్యాలు ఖరారు చేసిన కలెక్టర్
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ:
‘స్వర్ణాంధ్ర విజన్-2047’లో భాగంగా కర్నూలు జిల్లాను హరితవనంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ వేగవంతం చేసింది. 2047 నాటికి జిల్లాలో 50 శాతం అటవీ విస్తీర్ణాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ ఏడాది భారీ స్థాయిలో 45 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి వెల్లడించారు.
జూన్ 5న నిర్వహించనున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కేవలం 6 శాతం మాత్రమే అటవీ విస్తీర్ణం ఉందని, ప్రతి ఏడాది ప్రణాళికాబద్ధంగా మొక్కల పెంపకం చేపడితే 2047 నాటికి నిర్దేశించిన 50 శాతం లక్ష్యాన్ని చేరుకోవచ్చని పేర్కొన్నారు.
జిల్లాలో ఈ ఏడాది 45 లక్షల మొక్కలను నాటడానికి శాఖల వారీగా లక్ష్యాలను ఖరారు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో డీఆర్‌డీఏ, మెప్మా శాఖలకు అత్యధికంగా 20 లక్షల మొక్కల లక్ష్యం కేటాయించగా, డ్వామాకు 5 లక్షలు, ఉద్యానవన శాఖకు 5 లక్షలు, పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖకు 5 లక్షల మొక్కల లక్ష్యాన్ని నిర్దేశించారు. విద్యాశాఖకు 2 లక్షలు, అటవీ శాఖకు 1.8 లక్షలు, జాతీయ రహదారుల శాఖకు లక్ష, ఆర్ అండ్ బి శాఖకు లక్ష మొక్కల లక్ష్యాలను కేటాయించారు. అదేవిధంగా మున్సిపాలిటీలకు లక్ష మొక్కలు, ఐసీడీఎస్‌కు 5 వేల మొక్కలు, ఇతర శాఖలకు 3.12 లక్షల మొక్కల బాధ్యత అప్పగించినట్లు వెల్లడించారు.
మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నాటిన మొక్కలు బతికేలా నీటి సదుపాయం, ట్రీ గార్డులు, సంరక్షణ చర్యలు తప్పనిసరిగా చేపట్టాలన్నారు. గ్రామాలు, పాఠశాలలు, రహదారుల వెంట, ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలు, చెరువుల పరిసరాల్లో విస్తృత స్థాయిలో మొక్కలు నాటాలని సూచించారు.
ఇంకా పలు శాఖలు కార్యాచరణ ప్రణాళికలను సమర్పించలేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యాశాఖ, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, ఉద్యానవన శాఖ, నేషనల్ హైవే, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్, హౌసింగ్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖలు రెండు రోజుల్లోపు పూర్తి కార్యాచరణ ప్రణాళికలను సమర్పించాలని ఆదేశించారు.
పర్యావరణ పరిరక్షణతో పాటు భూగర్భజలాల పెంపు, వర్షాభావ నివారణ, ఉష్ణోగ్రతల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో హరితహారం కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. రాయలసీమలో పెరుగుతున్న ఎండల తీవ్రత, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారీ స్థాయిలో మొక్కల పెంపకం చేపట్టడం అవసరమని పేర్కొన్నారు.
సమావేశంలో ఇంచార్జి డీఎఫ్‌వో నాగమల్లేశ్వరి, హౌసింగ్ పీడీ చిరంజీవి, పంచాయతీరాజ్ ఎస్‌ఈ ప్రభాకర్‌రెడ్డి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, సీపీవో భారతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీత, అదనపు మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి రాజాకృష్ణారెడ్డి, ఐసీడీఎస్ పీడీ విజయ, బీసీ వెల్ఫేర్ అధికారి ప్రసన్న, డీపీవో భాస్కర్, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ జవహర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
