అంగరంగ వైభవంగా ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలు

అంగరంగ వైభవంగా ప్రారంభమైన సరస్వతి అంత్య పుష్కరాలు
తొలి పుష్కర స్నానంలో కంచి పీఠాధిపతి…
మంత్రులు, ప్రజాప్రతినిధుల
పవిత్ర సంగమంలో భక్తుల సందడి…
కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం
మహాదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం లో సరస్వతి నది అంత్య పుష్కరాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్కరాల తొలి రోజు ఉదయం 5.43 గంటలకు పవిత్ర త్రివేణి సంగమంలో తొలి పుష్కర స్నానం ఘనంగా నిర్వహించారు. ఈ మహా పుణ్యస్నానాన్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాములు ఆచరించగా, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, రాష్ట్ర ధార్మిక సలహాదారు శ్రీ గోవింద హరి తదితరులు పాల్గొన్నారు.
అదే విధంగా భూపాలపల్లి, రంగారెడ్డి నియోజకవర్గాల శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి కూడా పవిత్ర పుష్కర స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన తొలి పుష్కర స్నానం ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించింది. పుష్కరాల ప్రారంభం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, జ్ఞాన సరస్వతి అమ్మవారిని, శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్కర ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. “జై సరస్వతి మాత” ఓం నమశ్శివాయ నినాదాలతో క్షేత్రం మార్మోగింది.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భద్రత కోసం భారీగా పోలీసు బలగాలను మోహరించగా, పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తాగునీరు, వైద్య సేవలు, పార్కింగ్, రవాణా వంటి అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. “పుష్కరాలకు వచ్చే ప్రతి భక్తుడు సురక్షితంగా, సౌకర్యవంతంగా పుణ్యస్నానాలు ఆచరించుకునేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నాం” అని తెలిపారు. సరస్వతి అంత్య పుష్కరాల తొలి రోజే కాళేశ్వరం ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడగా, భక్తుల రాకతో పుణ్యక్షేత్రం భక్తి పరవశంలో మునిగిపోయింది.

