21stMaychintana | అహంకారం విడిచిన కుబేరుడికి శివుని ఉపదేశం

21stMaychintana | అహంకారం విడిచిన కుబేరుడికి శివుని ఉపదేశం

21stMaychintana | ఐశ్వర్యంతో పెరిగిన కుబేరుడి అహంకారం
గణపతిని విందుకు ఆహ్వానించిన కుబేరుడు
గణపతి ఆకలికి ఖాళీ అయిన కుబేరుడి సంపద
భక్తి ముందు సంపద విలువలేదని తెలిపిన గణపతి

21stMaychintana | ఈశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి, అందరికంటే తానే ధనవంతుడిననే అహంకారం కలిగింది. అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి, తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరినీ ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్తాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు, నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కుబేరుడు కైలాసానికి చేరుకుంటాడు.

శివుడు సర్వాంతర్యామి. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు. కుబేరుడి అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి, శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి శివునికి నమస్కరించి, “మహాదేవా.. మీరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి” అన్నాడు.

శివుడు తనకు కుదరదన్నాడు. భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే… “అమ్మా! ఆకలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు” అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి.. “కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు” అంది. వెంటనే మహాశివుడు “ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు” అన్నాడు పరమశివుడు.

“ఆహా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకొచ్చేది. ఎంత తింటాడులే” అనుకుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు. తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు. “ఇవన్నీ వ్యర్థం, నాకు అవసరం లేదు. మీరు నాకు త్వరగా ఆహారం పెట్టండి” అన్నాడు గణపతి. దాంతో కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు వడ్డించారు.

కుబేరుడు చూస్తుండగానే, ఒక్క పెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, “ఇంకా తీసుకురండి” అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. “ఇంకా కావాలి” అంటూ గణపతి అడిగాడు. వంటవారికి ఆహారం వండటం, గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం చూస్తుండగానే ఖాళీ అయిపోయింది. విషయం కుబేరుడికి తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడం లేదు. ఏమి చేయాలో అర్థంకాలేదు.

ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ, కుబేరుని పిలిచి, “నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్” అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్థమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏమాత్రం సంతృప్తిపరచలేదని, అన్నిటిని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహంకారాన్ని అణచడానికే పరమశివుడు ఈ విధంగా చేశాడని గ్రహించి, పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు.

“శివా.. శంకరా.. నీవే దిక్కు.. ధనానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి, అహంకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి, అన్నీ ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి” అన్నాడు.

అప్పుడు శివుడు “కుబేరా! నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావలసినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం. నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మాత్రమే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని అహంకారం విడిచి, చేసిన తప్పును ఒప్పుకుని, పరమభక్తితో గణపతికి సమర్పించు” అన్నాడు.

కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పెడు బియ్యం తినగానే, గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు. మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహంకారాన్ని అణచివేసిన గణపతి, మనలోని అహంకారాన్నీ పటాపంచలు చేయుగాక. నీతి: పెట్టేది కొంచెమైనా, అహంతో కాకుండా ప్రేమతో, భక్తితో పెట్టడం వల్ల అంతా మంచి జరుగుతుంది.

కామిడి సతీష్ రెడ్డి
9848445134

Leave a Reply