పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం

పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం
మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే ధ్యేయంగా ప్రముఖ ఫార్మా సంస్థ ‘దివిస్ లాబొరేటరీస్ లిమిటెడ్’ ముందడుగు వేసింది. ఆ సంస్థ అందించిన సుమారు రూ. 25,30,000/- (ఇరవై ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు) ఆర్థిక సహాయంతో చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ, 7వ, 12వ, 18వ వార్డులలో పునరుద్ధరించిన నాలుగు ఆర్వో వాటర్ ప్లాంట్లను బుధవారం మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్యతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ పావనిజం రమేష్ గౌడ్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. చౌటుప్పల్ పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం దివిస్ యాజమాన్యం ఎంతో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ముందుకు వచ్చిన దివిస్ యాజమాన్యానికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చౌటుప్పల్ పట్టణ ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే క్రమంలో భాగంగా.. గతంలో మూలనపడి, పూర్తిగా పనిచేయని స్థితిలో ఉన్న 9 ఆర్వో వాటర్ ప్లాంట్లను గుర్తించి, వాటిని తిరిగి పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకురావడంలో పట్టణ వార్డు కౌన్సిలర్లు, దివిస్ యాజమాన్యం చూపిన చొరవ అభినందనీయమని అన్నారు.
ఈ ప్లాంట్ల ద్వారా స్థానిక ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన తాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సిఎస్ఆర్) కింద దివిస్ సంస్థ చేస్తున్న ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, చౌటుప్పల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, 1వ వార్డు కౌన్సిలర్ కొసనం రాకేష్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, 12వ వార్డు కౌన్సిలర్ పాక చిరంజీవి,17వ వార్డు పాప్సం సభ్యులు పస్తం గంగారాములు, 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్,దివిస్ సంస్థ మేనేజర్ బి. కిషోర్ కుమార్, ప్రతినిధులు గోపికృష్ణ, వంశీకృష్ణ, మున్సిపల్ అధికారులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
