ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి మిషన్ భగీరథ తాగునీటి చౌర్యం
ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి మిషన్ భగీరథ తాగునీటి చౌర్యం
సిసి రోడ్డు పనులకోసం ట్యాంకర్లతో తాగునీరు తరలింపు
పట్టించుకోని మున్సిపల్ అధికారులు పాలకవర్గం
తాగునీరు అందక అల్లాడుతున్న జనం
మక్తల్ , మే 20 (ఆంధ్రప్రభ) ప్రజల తాగునీటి అవసరాల కోసం ఏర్పాటుచేసిన ఓవర్ హెడ్ ట్యాంకుల నుండి మిషన్ భగీరథ తాగునీటి చౌర్యం యదేచ్ఛగా కొనసాగుతుంది. కొంతమంది ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు తమ ట్యాంకర్ల ద్వారా నీటి చౌర్యానికి పట్టపగలే పాల్పడుతున్న ఇటు మున్సిపల్ అధికారులు పాలకవర్గ సభ్యులు పట్టించుకోవడం లేదు. దీంతో వేసవిలో తాగునీరు అందకు జనం అల్లాడుతున్న సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో చోటుచేసుకుంది .10 ,15 రోజులుగా నీటిచౌర్యం జరుగుతున్నట్లు ఆలస్యంగా తెలిసింది .పట్టణంలోని 167 వ జాతీయ రహదారికి అనుకొని ఉన్న మున్సిపాలిటీకి చెందిన ఓవర్ హెడ్ ట్యాంకర్ నుండి ప్రైవేట్ ట్యాంకర్లు తాగునీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. ఏ మున్సిపాలిటీలోనైనా, ఏ గ్రామపంచాయతీలోనైనా వేసవిలో తాగునీటి సమస్య ఉత్పన్నమైతే ట్యాంకర్లను ఏర్పాటు చేసి ప్రైవేట్ బోర్ల నుండి నీటిని కొనుగోలు చేసి ఇంటింటికి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసే ఏర్పాటును అధికార యంత్రం పాలకవర్గాలు ఏర్పాటు చేస్తాయి. కానీ అందుకు భిన్నంగా మక్తల్ మున్సిపాలిటీలో ప్రజలు తాగునీరు అందక అల్లాడుతుంటే మిషన్ భగీరథ తాగునీటిని ప్రైవేటు వ్యక్తులు సీసీ రోడ్ల కోసం దోచుకు వెళ్లడం విశేషం. ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్న తాగునీటిని సీసీ రోడ్ల కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. గత కొంతకాలంగా పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆ పనులను చేపడుతున్న కాంట్రాక్టర్లు ప్రైవేట్ బోర్ల నుండి నీటిని తెచ్చుకోవాల్సింది ఉండగా తాగునీటి కోసం ఉపయోగించే మున్సిపాలిటీకి చెందిన ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి మిషన్ భగీరథ తాగునీటిని దర్జాగా దోచుకెళుతున్న పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు .
దీంతో పట్టణంలోని పలు వార్డుల్లో తాగునీరు అందక జనం అల్లాడిపోతున్నారు .ఈ సంఘటన గత కొంతకాలంగా జరుగుతున్నప్పటికి ఇటు మునిసిపల్ అధికారులు సిబ్బందికి తెలియకుండా ఉంది అంటే నమ్మే పరిస్థితి కూడా లేదు. ట్యాంకర్ల ద్వారా నీటి చౌర్యానికి మున్సిపల్ సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి .ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికీ సిసి రోడ్ల కోసమే కదా అని ఊరుకున్నట్లు తెలుస్తోంది .సిసి రోడ్లకు బోరు నీటిని ఉపయోగించాల్సింది పోయి మిషన్ భగీరథ తాగునీటిని దోచుకు వెళ్లడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .మూడు నాలుగు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకెళుతున్నట్లు స్థానికులు తెలిపారు .పట్టపగలే ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి నీటిచౌర్యం జరుగుతున్న కూడా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో అధికారులు మున్సిపల్ పాలకవర్గం ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన పలువురిని ఆందోళనకు గురిచేస్తుంది. ఎంత ధైర్యం ఉంటే ప్రజల కోసం ఉపయోగించాల్సిన మిషన్ భగీరథ నీటిని ట్యాంకర్లతో సిసి రోడ్ల కోసం తరలిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు .ఇంత దౌర్జన్యం ఎన్నడూ చూడలేదని ఎక్కడ వినలేదని అంటున్నారు .ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పాలకవర్గ సభ్యులు స్పందించి మిషన్ భగీరథ తాగునీటి చౌర్యాన్ని అరికట్టాలని గత కొంకాలంగా నీటి చౌర్యానికి పాల్పడ్డా వాటర్ ట్యాంకర్లపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

