ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై రెండు రోజుల నిరసన కార్యక్రమాలు
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై రెండు రోజుల నిరసన కార్యక్రమాలు
నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు – పుత్తూరు డిపోలో నేడు గేట్ సమావేశం
పుత్తూరు, ఆంధ్రప్రభ : ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏ పి పి టి డి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మే 20, 21 తేదీలలో మొదటి బస్సు నుంచే ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా పుత్తూరు డిపోలో ఉదయం 10 గంటలకు గేట్ సమావేశం నిర్వహించనున్నట్లు డిపో కార్యదర్శి ఎం. శివకుమార్ తెలిపారు.
సంఘం ప్రధాన డిమాండ్లలో విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. స్త్రీ శక్తి బస్సుల్లో “సున్నా టికెట్” విధానాన్ని నిలిపివేసి మిగతా ప్రయాణికులకు సాధారణ టికెట్లు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే వేతన సవరణ కమిటీని నియమించి మధ్యంతర ఉపశమనాన్ని వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు కరువు భత్యాలు, బకాయిలు, సెలవుల నగదీకరణ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులను వెంటనే కొనుగోలు చేయడం, అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడం, పదవీ విరమణ చేసిన మరియు మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు వెంటనే ఆర్థిక పరిష్కారాలు అందించడం, ఉద్యోగులను ఈహెచ్‌ఎస్ పథకం నుంచి మినహాయించి గతంలో అమలులో ఉన్న ఆర్టీసీ వైద్య సదుపాయాలను పునరుద్ధరించాలని కోరారు.
ఈ రెండు రోజుల నిరసన కార్యక్రమానికి ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు.
