అంతమ్మగూడెంలో రసాయన రక్కసి

అంతమ్మగూడెంలో రసాయన రక్కసి
- టీజీపీసీబీ మెంబర్ సెక్రటరీ నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ పరిధిలోని భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ సమీపంలో ఉన్న రసాయన పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్యాన్ని వెదజల్లుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వాయు, జల కాలుష్యంతో స్థానికులు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నా తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీజీపీసీబీ) మెంబర్ సెక్రటరీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు అంతమ్మగూడెం, పరిసర గ్రామాల ప్రజలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), టీజీపీసీబీ చైర్మన్‌కు ఒక సుదీర్ఘ వినతి పత్రాన్ని సమర్పించారు.
కాలుష్యానికి నిలువెత్తు సాక్ష్యాలున్నా చర్యలు శూన్యం
అంతమ్మగూడెం గ్రామస్తులు తమ వినతిపత్రంలో పలు విస్తుపోయే నిజాలను పేర్కొన్నారు. గత మార్చి 13, 2026న టీజీపీసీబీ నల్గొండ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం.. మెస్సర్స్ హజేలో లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ఎలాంటి అనుమతి లేకుండా రసాయన వ్యర్థాలను బైపాస్ పైప్ లైన్ల ద్వారా నేరుగా బయటకు వదిలి వేస్తోందని, తీవ్ర వాయు కాలుష్యానికి కారణమవుతోందని స్పష్టమైంది. గత 2022 మార్చిలో, జూన్ 2025 లో టీజీపీసీబీ అధికారులు, సెంట్రల్ కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) అధికారులు తనిఖీలు చేసినప్పుడు కూడా అంతమ్మగూడెం పరిధిలోని ఈ పరిశ్రమలు విచ్చలవిడిగా కాలుష్యానికి పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. పరిశ్రమల అనుమతుల కాలం ముగిసిపోయినప్పటికీ ఆ పరిశ్రమలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండానే నిబంధనలకు విరుద్ధంగా అనుమతులను రెన్యువల్ చేస్తున్నారని వారు ఆరోపించారు.
టాస్క్ ఫోర్స్ సమావేశాల వివరాల దాగుడుమూతలు
గతంలో పరిశ్రమలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు అధికారులు తనిఖీలు చేసి కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో బాధితుల సమక్షంలో టాస్క్ ఫోర్స్ సమావేశాలు నిర్వహించి పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకునేవారు. ప్రస్తుత కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ మాత్రం బాధితులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, టాస్క్ ఫోర్స్ సమావేశాల వివరాలను దాచిపెడుతూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న కంపెనీలపై క్లోజర్ ఆర్డర్స్ ఇవ్వకుండా, కేవలం బ్యాంకు గ్యారంటీలను జప్తు చేసి చేతులు దులుపుకుంటూ పరిశ్రమల యాజమాన్యాలకు మద్దతుగా నిలుస్తున్నారని లేఖలో మండిపడ్డారు.
ఊపిరి ఆడటం లేదు.. పంటలు పండటం లేదు
అంతమ్మగూడెం గ్రామ పరిధిలో ఉన్న పరిశ్రమల రసాయన పొగలు, వ్యర్థాల వల్ల స్థానికుల ఊపిరితిత్తులు పాడవుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రసాయన జలాలు భూమిలోకి ఇంకిపోవడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమై తాగునీరు దొరకని దారుణ పరిస్థితి ఏర్పడిందని, పొలాల్లో పంటలు పండటం లేదని వాపోయారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న పరిశ్రమలపై ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందించాలన్నారు. తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతమ్మగూడెం గ్రామస్థులు, బాధితులు వేడుకుంటున్నారు.
