ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నిత్య అన్నదానం

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో నిత్య అన్నదానం
- ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
రేగొండ, ఆంధ్రప్రభ:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ప్రసిద్ధ కొడవటంచ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో నిత్య అన్నదాన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. భూపాలపల్లి జిల్లా ఆర్య వైశ్య సంఘం, రేగొండ ఆర్య వైశ్యుల సంయుక్త ఆధ్వర్యంలో ఏడాది పొడవునా సాగే 365 రోజుల నిత్య అన్నదాన పథకాన్ని భూపాలపల్లి శాసనసభ్యులు (ఎమ్మెల్యే) గండ్ర సత్యనారాయణ రావు (జీఎస్ఆర్) ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టడం చాలా అభినందనీయమన్నారు. ఈ సేవ ద్వారా దూర ప్రాంతాల నుండి స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని తెలిపారు. అన్నదానం వంటి సత్కార్యాల వల్ల దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొడవటంచ క్షేత్ర అభివృద్ధికి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సేవా కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ నాయినేని సంపత్ రావు, భూపాలపల్లి జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య పాల్గొన్నారు. వీరితో పాటు ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు, దేవాలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
