పరువు పేరుతో అక్కపై తమ్ముళ్ల దారుణం..

పరువు పేరుతో అక్కపై తమ్ముళ్ల దారుణం..
కొడవలితో విచక్షణారహితంగా నరికి చనిపోయిందని వదిలివేత…
తీవ్ర గాయాలతో మహిళ జీవన్మరణ పోరాటం…
పెద్ద కడబూరు, ఆంధ్రప్రభ : కుటుంబ పరువు తీసిందనే ఆగ్రహంతో తోడపుట్టిన తమ్ముళ్లే కాలయముళ్లుగా మారిన దారుణ ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. వివాహేతర సంబంధం వ్యవహారం గ్రామంలో వైరల్ కావడంతో ఆగ్రహించిన ఇద్దరు తమ్ముళ్లు తమ అక్కపై కొడవలితో విచక్షణారహితంగా దాడి చేసి, చనిపోయిందని భావించి అక్కడి నుంచి పరారైన ఘటన పెద్దకడబూరు మండలంలో తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల వివరాల మేరకు… పెద్దకడబూరు మండలం, ముచ్చుగిరి గ్రామానికి చెందిన బాధిత మహిళకు దాదాపు 20 సంవత్సరాల క్రితం పర్వతాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఇద్దరూ విడిపోయారు. అనంతరం ఒక కుమార్తె తండ్రి వద్ద, మరో కుమార్తె తల్లి వద్ద ఉండిపోయింది.

భర్తకు దూరమైన తర్వాత బాధితురాలు తన పుట్టినిల్లయిన ముచ్చుగిరి గ్రామంలోనే నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ మాజీ ఫీల్డ్ అసిస్టెంట్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధానికి దారితీసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
అయితే, సదరు వ్యక్తి తన స్నేహితుడితో కలిసి మహిళతో ఏకాంతంగా ఉన్న దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించినట్లు సమాచారం. అనంతరం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం గ్రామమంతా వ్యాపించింది. ఈ వీడియోలు కుటుంబ సభ్యులకు చేరడంతో మహిళ తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.
తమ కుటుంబ పరువు తీసిందనే కక్షతో ఇద్దరు తమ్ముళ్లు సోమవారం రాత్రి పక్కా ప్రణాళికతో అక్క ఇంటికి వెళ్లినట్లు సమాచారం. “కుటుంబాన్ని అవమానానికి గురిచేశావు” అంటూ ఆమెతో వాగ్వాదానికి దిగిన వారు, అనంతరం చేతిలో ఉన్న కొడవలితో తల, మెడ, చేతులపై విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావంతో మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది.
ఆమె మృతి చెందిందని భావించిన నిందితులు, మహిళతో సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ స్నేహితుడి ఇంటి వద్ద ఆమెను పడేసి పరారైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
మంగళవారం ఉదయం తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దకడబూరు పోలీసులు ఆమె ఇంకా ప్రాణాలతో ఉండటాన్ని గుర్తించి చికిత్స నిమిత్తం ముందుగా ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అయితే తీవ్ర రక్తస్రావం, లోతైన గాయాల కారణంగా పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ మృత్యువుతో పోరాడుతున్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ బాధితురాలి పరిస్థితిని బట్టి హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
