వ్వవసాయ బావి పనుల్లో విషాదం..

వ్వవసాయ బావి పనుల్లో విషాదం..

  • ఇద్దరు కూలీల మృతి

పాలకుర్తి, ఆంధ్రప్రభ : రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలపై విధి కన్నుకుట్టింది. ఉపాధి కోసం వెళ్లిన ఇద్దరు కూలీలు బావి పనుల్లో మృత్యువాత పడగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. ఈ విషాద ఘటన పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని మామిడాల రాజేశంకు చెందిన వ్యవసాయ బావి చుట్టూ గాజులు పోసే పనులు జరుగుతున్నాయి.

వెంకట్‌రావుపల్లికి చెందిన రెచవెణి రాజయ్య పెద్దపల్లిలో నివాసం ఉంటూ 10 మంది కూలీలతో కలిసి పనులు చేపట్టాడు. పనులు ప్రారంభించిన కొద్ది సేపటికే బావి చుట్టూ వేసిన సిమెంట్, మట్టి ఒక్కసారిగా బావిలోకి కూలిపోయాయి. ఈ ఘటనలో రాజయ్యతో పాటు వడ్కపూర్‌కు చెందిన భీమోజు రామోజీ చారి, సాగర్ల శ్రీనివాస్ లు బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ కు తీవ్ర గాయాలతో బయటపడగా వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.

రామోజీ చారి అక్కడికక్కడే మృతి చెందగా, రాజయ్య బావిలోని మట్టిలో చిక్కుకుపోయాడు. ఒడ్డున ఉన్న కూలీలు కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి డీసీపీ రామ్‌రెడ్డి, ఏసీపీ జి.కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, బసంత్‌నగర్ ఎస్ఐ నూతి శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రొక్లెయిన్ సహాయంతో బావిలో సుమారు 10 అడుగుల మేర పడిపోయిన మట్టిని తొలగించారు. అనంతరం రాజయ్య మృతదేహాన్ని వెలికితీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించగా గ్రామస్తులు “అయ్యో పాపం” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే
ఘటన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాయపడిన శ్రీనివాస్‌కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.