గోదావరిలో గల్లంతైన కార్మికుడి మృతదేహం లభ్యం

మహదేవపూర్, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో గల్లంతైన యువ కార్మికుడి మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డ్రిల్లింగ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రమోద్ గుప్తా (21) బుధవారం ఇద్దరు స్నేహితులతో కలిసి గోదావరిలో స్నానానికి దిగాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు లోతైన నీటిలోకి వెళ్లడంతో గల్లంతయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఎల్‌అండ్‌టీ సిబ్బందితో కలిసి రాత్రంతా గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించలేదు. కాగా గురువారం ఉదయం సుమారు 6.30 గంటల సమయంలో బ్యారేజీకి దిగువన కిలోమీటరు దూరంలో మృతదేహం కనిపించింది.
మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
