Rice Production India | వరి సాగుతో పెరుగుతున్న నీటి సంక్షోభం

Rice Production India | వరి సాగుతో పెరుగుతున్న నీటి సంక్షోభం
Rice Production India | వరి ఉత్పత్తి పెరుగుదల వెనుక ప్రమాద సంకేతాలు
పప్పుధాన్యాలు, నూనెగింజల సాగులో క్షీణత
జీనోమ్ ఎడిటింగ్‌పై శాస్త్రవేత్తల ఆందోళనలు
చిరుధాన్యాల ప్రాముఖ్యతను గుర్తించాల్సిన అవసరం
పంట వైవిధ్యమే భవిష్యత్ ఆహార భద్రత
Rice Production India | భారతదేశ వ్యవసాయ రంగం ప్రస్తుతం ప్రమాదకరమైన మార్పులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్న వరి ఉత్పత్తిని, బియ్యం, చిరుధాన్యాల సాగు విస్తరణను విజయంగా ప్రచారం చేస్తున్నప్పటికీ, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగులో జరుగుతున్న తీవ్రమైన తగ్గుదల ఆహార భద్రత, పర్యావరణ సమతుల్యత, నేల ఆరోగ్యం, ప్రజల పోషకాహార భద్రతకు నిశ్శబ్ద ముప్పుగా మారుతోంది. వ్యవసాయ ఉత్పాదకతలో సాధించిన విజయంగా కనిపిస్తున్నది. వరి ఉత్పత్తిని గరిష్ట స్థాయికి తీసుకెళ్లాలనే మోజు భారత వ్యవసాయాన్ని పర్యావరణ అసమతుల్యత వైపు నెడుతోంది. అధిక నీటి వినియోగం, రసాయన ఎరువులు, ఒకే పంట సాగు విధానం, పంట వైవిధ్యం తగ్గిపోవడం వంటి అంశాలు భవిష్యత్ తరాలకు తీవ్రమైన ప్రభావాలను మిగుల్చే పరిస్థితిని సృష్టిస్తున్నాయి.
వరిపై మోజు
శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు, వ్యవసాయ ఆర్థిక నిపుణులు వరి ఆధారిత వ్యవసాయం ప్రమాదకరమని పదేపదే హెచ్చరిస్తున్నప్పటికీ, భారత్ వరిపై ఆధారపడటాన్ని మరింతగా పెంచుకుంటోంది. తాజా వ్యవసాయ గణాంకాల ప్రకారం అనేక ప్రాంతాల్లో వరి సాగు అంచనాలను మించిపోయింది. తెలంగాణలో వరి సాగు అధికారిక లక్ష్యాలను దాటి దాదాపు 178 శాతం వరకు పెరిగింది. అదే సమయంలో చిరుధాన్యాల సాగు పెరిగినా, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు తీవ్రంగా తగ్గిపోయింది. ప్రభుత్వ కొనుగోలు హామీ, కనీస మద్దతు ధర, నీటి లభ్యత, తక్షణ మార్కెట్ డిమాండ్ రాజకీయ ప్రోత్సాహకాలు కారణమవుతున్నాయి. మరోవైపు పప్పుధాన్యాలు, నూనెగింజలకు స్థిరమైన మార్కెట్ లేకపోవడం, బలహీనమైన కొనుగోలు వ్యవస్థలు, ధరలు పతనం కావడం వంటి సమస్యలున్నాయి.
వరి ఉత్పత్తి వెనుక నీటి సంక్షోభం
వరి ప్రపంచంలో అత్యధిక నీటిని వినియోగించే పంటలలో ఒకటి. ఒక కిలో బియ్యం ఉత్పత్తి చేయడానికి 3,000 నుంచి 5,000 లీటర్ల వరకు నీరు అవసరమవుతుంది. ఇప్పటికే భూగర్భజలాల కొరతను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో నిరంతర వరి సాగు పర్యావరణ సంక్షోభాన్ని మరింత వేగవంతం చేస్తోంది. తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అధిక నీటి వినియోగ వ్యవసాయం కారణంగా తీవ్రమైన భూగర్భజల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

వాతావరణ మార్పుల కారణంగా నీటి వనరులు తగ్గిపోతున్న సమయంలో కూడా భారత్ మరింత వరి ఉత్పత్తి వైపు పయనించడం వ్యంగ్యంగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం 5 మిలియన్ హెక్టార్ల వరి సాగును తగ్గించి, జన్యు సవరణ సాంకేతికతతో అధిక దిగుబడులు సాధించాలని యోచిస్తోంది. దీన్ని సాంకేతిక విప్లవంగా ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇది అనేక ఆందోళనలను రేకెత్తిస్తోంది.
జీనోమ్ ఎడిటింగ్: శాస్త్రీయ పురోగతా?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల సాంకేతికతతో అభివృద్ధి చేసిన డిఆర్ఆర్ ధన్ 100 (కమల), పూసా డిఎస్టి రైస్ 1 వంటి కొత్త వరి రకాలను ప్రవేశపెట్టింది. ఈ రకాలు ఉత్పాదకతను పెంచుతాయని, నీటిని ఆదా చేస్తాయని, తక్కువ భూభాగంలో అధిక దిగుబడి ఇస్తాయని, వాతావరణ మార్పులకు తట్టుకుంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే శాస్త్రవేత్తలు జీనోమ్ ఎడిటింగ్ సాంకేతికతల భద్రతపై ఇంకా అనిశ్చితి ఉందని హెచ్చరిస్తున్నారు. సిఆర్ఎస్పిఆర్ ఆధారిత మార్పులు అనుకోని జన్యు సమస్యలు, పర్యావరణ ప్రభావాలను కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అధిక వరి ఉత్పత్తిని కొనసాగించడానికి మానవాళి జన్యుమార్పిడి పంటలపై ఎందుకు ఆధారపడాలనేది అతి పెద్ద ప్రశ్నగా మారుతోంది.
పప్పుధాన్యాలు, నూనెగింజల క్షీణత
వరి ఉత్పత్తి పెరుగుతున్న సమయంలో పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు క్షీణిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే పప్పుధాన్యాలు భారతదేశంలో కోట్లాది పేద మరియు శాకాహార కుటుంబాలకు ప్రధాన ప్రోటీన్ వనరు. నూనెగింజలు తినే నూనెల భద్రతకు కీలకం. భారత్ ఇప్పటికే భారీస్థాయిలో వంటనూనెలను దిగుమతి చేసుకుంటోంది. దేశీయ నూనెగింజల సాగు తగ్గిపోతే దిగుమతులపై ఆధారపడటం మరింత పెరుగుతుంది.
వరి పంటతో పోలిస్తే పప్పుధాన్యాలు వాతావరణంలోని నత్రజనిని నేలలో స్థిరపరచి నేల సారాన్ని సహజంగా పెంచుతాయి. అవి రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గిస్తాయి.
చిరుధాన్యాలు: మానవాళి మరచిపోయిన భవిష్యత్తు
వాతావరణ మార్పులకు తట్టుకునే ఉత్తమ పంటలు ఇప్పటికే మన దగ్గరే ఉన్నాయి.. అవే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు. చిరుధాన్యాలకు చాలా తక్కువ నీరు సరిపోతుంది. తక్కువ ఎరువులు అవసరం. కరువు పరిస్థితుల్లో కూడా పెరుగుతాయి. పోషకాహారాన్ని మెరుగుపరుస్తాయి. వాతావరణ సంక్షోభాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
ప్రపంచ వాతావరణ సంక్షోభం, ఎరువుల కొరత, అనిశ్చిత మాన్సూన్ పరిస్థితులు ఇప్పుడు బజ్రా, జొన్న, రాగులు, పప్పుధాన్యాల ప్రాముఖ్యతను మళ్లీ గుర్తు చేస్తున్నాయి. పత్తి లేదా వరితో పోలిస్తే చిరుధాన్యాలకు చాలా తక్కువ నీరు, రసాయనాలు సరిపోతాయి.
వరి రాజకీయ ఆర్థిక వ్యవస్థ
వరి సాగు కొనసాగడం కేవలం వ్యవసాయ సమస్య కాదు, అది రాజకీయ అంశం కూడా. ప్రభుత్వాలు వరికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థలు బలంగా ఉన్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యంపై ఆధారపడి ఉంది. వరి కొనుగోలు ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. భారీ ఎరువుల పరిశ్రమలు కూడా వరి ఆధారిత సాగుతో లాభపడుతున్నాయి. ఈ విధానపరమైన మొగ్గు పంట వైవిధ్యాన్ని నిరుత్సాహపరుస్తోంది. పప్పుధాన్యాలు, నూనెగింజలకు ఎంఎస్పీ పెంచినా, రైతులు వరి నుంచి మారడానికి వెనుకాడుతున్నారు.
పంట వైవిధ్యమే అసలైన ఆహార భద్రత
ఆహార భద్రత అంటే గరిష్టంగా బియ్యం ఉత్పత్తి చేయడం కాదు. ఆరోగ్యకరమైన సమాజానికి పంట వైవిధ్యం, పోషక సమతుల్యత, నేల సంరక్షణ, నీటి పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత అవసరం. మానవ మనుగడ వ్యవసాయ పరిమాణంపై మాత్రమే కాదు, పర్యావరణ సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది.
ముందుకు వెళ్లే మార్గం
భారతదేశం తన వ్యవసాయ ప్రాధాన్యతలను అత్యవసరంగా పునరాలోచించాలి. వరి, పప్పుధాన్యాలు, నూనెగింజల మధ్య పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలి. పప్పుధాన్యాలు, చిరుధాన్యాల కొనుగోలును బలోపేతం చేయాలి. జన్యుమార్పిడి పంటలపై అధిక ఆధారపడటాన్ని కూడా పునరాలోచించాలి.
నియంత్రణ లేకుండా పెరుగుతున్న వరి ఉత్పత్తి ప్రస్తుతం ఆర్థికంగా లాభదాయకంగా కనిపించవచ్చు. కానీ దీని దీర్ఘకాల ప్రభావాలు వినాశకరంగా మారే ప్రమాదం ఉంది. ఒక దేశ వ్యవసాయ విజయాన్ని అది ఎంత బియ్యం ఉత్పత్తి చేస్తుందనే దానితో కాకుండా, భూమి, నీరు, జీవ వైవిధ్యం, భవిష్యత్ తరాల ఆరోగ్యాన్ని ఎంతవరకు రక్షిస్తుందనే దానితో కొలవాలి. స్వల్పకాలిక ఉత్పత్తి లాభాల కోసం మానవాళి పర్యావరణ సమతుల్యతను త్యాగం చేస్తూ కొనసాగితే, వరి ఉత్పత్తి పెరుగుదల నిజంగానే మానవాళికి శాపంగా మారవచ్చు.
డా. ముచ్చుకోట సురేష్ బాబు
99899 88912
