చిట్యాలలో నామమాత్రంగా ప్రారంభమైన యువజన వారోత్సవాలు

చిట్యాలలో నామమాత్రంగా ప్రారంభమైన యువజన వారోత్సవాలు

  • ప్రజాప్రతినిధులు, యువకుల గైర్హాజరు

చిట్యాల, ఆంధ్రప్రభ:
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల ఉత్సవాల్లో భాగంగా సోమవారం మండల కేంద్రంలో ప్రారంభమైన ‘యువజన వారోత్సవాలు’ మొదటి రోజే నామమాత్రంగా సాగాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈనెల 18 నుండి 23 వరకు వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. ఇందులో భాగంగా మొదటి రోజు ‘ఫిట్ అండ్ యాక్టివ్’ థీమ్‌తో ఉదయం మండల కేంద్రంలో మారథన్ రన్ నిర్వహించారు.

అంబేద్కర్ సెంటర్ నుండి ఛత్రపతి శివాజీ విగ్రహం వరకు సాగిన ఈ మారథన్ రన్‌కు సంబంధిత అధికారులు, స్థానిక యువకులు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కార్యక్రమం వెలవెలబోయింది. స్థానిక ఎంపీడీవో సెలవులో ఉండటం, దానికి తోడు యువత, గ్రామీణ ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడంతో మొదటి రోజు ఉత్సవాలు నామమాత్రంగానే ముగిశాయి.

అధికారికంగా నిర్వహించిన ఈ రన్ కార్యక్రమంలో చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, నాల్గవ వార్డు సభ్యుడు (వార్డ్ మెంబర్) తౌటం నవీన్, ఎంపీఓ రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది మాత్రమే పాల్గొన్నారు. ఉత్సవాల మొదటి రోజే సమన్వయ లోపం స్పష్టంగా కనిపించడంతో, రాబోయే రోజుల్లో అయినా యువతను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని స్థానికులు కోరుతున్నారు.