ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అండగా నిలవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అండగా నిలవాలి
- అధికారులకు సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ:
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆయన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్‌తో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు ప్రక్రియను పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తూ.. కొనుగోళ్లకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రైతుల ప్రయోజనాలను కాపాడాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పోలీస్ శాఖ తరఫున తగిన భద్రతా ఏర్పాట్లు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా అవసరాన్ని బట్టి లారీలు, ఇతర రవాణా వాహనాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా, ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం అక్రమంగా తెలంగాణలోకి వచ్చి ఇక్కడి కేంద్రాల్లో విక్రయించకుండా ఉండేందుకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కట్టుదిట్టమైన నిఘా ఉంచామని, తనిఖీలను మరింత ముమ్మరం చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో గున్నాల రాజేందర్, కొండాపూర్ తహసీల్దార్ అశోక్, పలు శాఖల అధికారులు మరియు స్థానిక రైతులు పాల్గొన్నారు.
