రైల్వే స్టేషన్లకు ఆధునిక హంగులు..

రైల్వే స్టేషన్లకు ఆధునిక హంగులు..

అమృత్ భారత్ పథకంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మారుతున్న ముఖచిత్రం
ప్రయాణికుల సౌకర్యాలకు పెద్దపీట.. వేగంగా అభివృద్ధి పనులు

గుంటూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలను పూర్తిగా మార్చేస్తోంది. గతంలో కనీస సౌకర్యాల కోసం ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఇక ఆధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఈ పథకం కింద గుంటూరు డివిజన్ పరిధిలోని గుంటూరు, తెనాలి, మంగళగిరి, నరసరావుపేట, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, దొనకొండ, రేపల్లె రైల్వే స్టేషన్లు ఎంపికయ్యాయి.

ఈ స్టేషన్లలో కొత్త భవనాలు, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పార్కింగ్ సదుపాయాలు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు వేగంగా నిర్మిస్తున్నారు. గుంటూరు స్టేషన్ అభివృద్ధికి సుమారు రూ.15.8 కోట్లు, రేపల్లెకు రూ.25.5 కోట్లు కేటాయించినట్లు సమాచారం.

ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ సీసీ కెమెరాలు, అదనపు భద్రతా సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా స్టేషన్ డిజైన్లు రూపొందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ప్రత్యేకంగా గుంటూరు, తెనాలి, నరసరావుపేట, నడికుడి జంక్షన్లలో జరుగుతున్న పనులు భారీ ప్రయాణికుల రద్దీకి ఉపశమనం కలిగించనున్నాయి. కొత్త లిఫ్టులు, వెయిటింగ్ హాళ్లు, పార్కింగ్ సదుపాయాలు వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.

మరో కొద్ది నెలల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రైల్వే స్టేషన్లు ఆధునిక హంగులతో కొత్త రూపంలో దర్శనమివ్వనున్నాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply