Telangana Fee Reimbursement | ముదురుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ సంక్షోభం

Telangana Fee Reimbursement | ముదురుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ సంక్షోభం
Telangana Fee Reimbursement | రూ. 9 వేల కోట్ల బకాయిలతో విద్యార్థుల ఆందోళన
హైకోర్టు స్టేతో పెరిగిన భారం
ఫీజులు చెల్లించలేక సతమతమవుతున్న విద్యార్థులు
భారీ ర్యాలీకి విద్యార్థి సంఘాల సిద్ధత
Telangana Fee Reimbursement | హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వ్యవహారం ముదురుతోంది. ఏళ్ల తరబడి పేరుకుపోయిన బకాయిలు, ప్రభుత్వాల ఉదాసీనత, కాలేజీ యాజమాన్యాల ఒత్తిళ్ల మధ్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తమ హక్కుల సాధన కోసం విద్యార్థి సంఘాలన్నీ ఏకమై రాష్ట్ర సర్కారుపై పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దాదాపు రూ. 9 వేల కోట్ల బకాయిల విడుదల కోసం ఈ నెల 21 లేదా 22వ తేదీన అన్ని విద్యార్థి సంఘాల నేతృత్వంలో భారీ సమావేశం నిర్వహించి, అనంతరం హైదరాబాద్ వేదికగా ‘చలో సెక్రటేరియట్’ లేదా భారీ ర్యాలీకి పిలుపునిచ్చేందుకు అన్ని విద్యార్థి సంఘాల నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ నేతృత్వం వహించనున్నారని తెలిసింది.
ఏటా పెరుగుతున్న బకాయిలు
ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 6,800 కోట్ల బాకీలను పెండింగ్‌లో పెట్టి వెళ్లగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం రూ. 500 కోట్ల లోపు మాత్రమే విడుదల చేసింది. ప్రస్తుతం బకాయిలు రూ. 9 వేల కోట్లకు చేరుకున్నాయి.
ఏటా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, లా వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న సుమారు 12.4 లక్షల మంది విద్యార్థులు ఈ రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేస్తామని (డీబీటీ) జీవో నంబర్ 7ను తీసుకొచ్చింది. విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తే కాలేజీలకు ఫీజులు అందడం లేదని మేనేజ్‌మెంట్లు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారించిన కోర్టు, జీవో నంబర్ 7లోని 12వ నిబంధనపై స్టే ఇచ్చింది. విద్యార్థుల నుంచి కాలేజీలు నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేయడంతో విద్యార్థులపై భారం పడింది. సొమ్ము ఖాతాల్లో పడకముందే ఫీజులు కట్టేయాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి.
ఫీజులు చెల్లించలేక విద్యార్థుల సతమతం
ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఉస్మానియా తదితర యూనివర్సిటీల్లో సైతం మొత్తం ఫీజులు చెల్లించాలనే నిబంధనలు పెట్టడంతో విద్యార్థులు సతమతమవుతున్నారు. చదువు పూర్తయిన విద్యార్థులకు ఫీజులు కట్టలేదన్న కారణంతో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఉన్నత చదువులకు వెళ్లలేక, ఉద్యోగాల్లో చేరలేక వేలాది మంది విద్యార్థులు మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
ఈ సమస్య పరిష్కారానికి విద్యార్థి సంఘాలు పోరాటానికి సిద్ధమయ్యాయి. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో విద్యార్థి నేతలంతా సమావేశమై కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిసింది. కనీసం 20 వేల మందితో హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయం తీసుకోనున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఈ ఉద్యమానికి బాధ్యత వహించనున్నట్లు తెలిసింది.
