Hyderabad Chain Snatching | హైదరాబాద్‌లో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు

Hyderabad Chain Snatching | హైదరాబాద్‌లో పెరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు

Hyderabad Chain Snatching | బంగారం ధరలు పెరగడంతో దొంగల దృష్టి
వరుస ఘటనలతో ఉలిక్కిపడిన వరంగల్, హనుమకొండ
పోలీసుల దర్యాప్తు వేగవంతం
ప్రజలకు కీలక సూచనలు

Hyderabad Chain Snatching | హైదరాబాద్, ఆంధ్రప్రభ: పెరుగుతున్న బంగారం ధరలు దొంగలను ఉసిగొల్పేలా చేస్తున్నాయి. ఒక్క తులం చోరీ చేస్తే చాలు లక్షన్నర చేతిలోకి వచ్చేసినట్టే. అందుకే నగరాలు, పట్టణాల్లో చైన్ స్నాచింగ్ ఘటనలు పెరిగిపోతున్నాయి. తక్కువ సమయంలో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో కొందరు దొంగలు మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులు అపహరిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, హనుమకొండ వంటి ప్రధాన నగరాల్లో ఇటీవల వరుస ఘటనలు చోటు చేసుకోవడం ప్రజల్లో భయాందోళనలకు దారితీసింది.

హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్, బంగారం దోపిడీలు పెరిగాయి. చైన్ స్నాచింగ్లలో ఎక్కువగా ఇతర రాష్ట్రాలకు చెందిన నిందితులే పాల్గొంటున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరు ముందుగా స్థానికంగా ద్విచక్ర వాహనాలను చోరీ చేసి, వాటినే నేరాలకు వినియోగిస్తున్నారు. మాస్కులు ధరించి రాత్రివేళల్లో లేదా ఉదయం వేళల్లో జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకుంటున్నారు. చోరీ చేసిన వాహనాలతో నేరాలకు పాల్పడటం వల్ల సీసీ కెమెరాల్లో నంబర్లు కనిపించినా నిందితుల జాడ కనిపెట్టడం పోలీసులకు కష్టంగా మారుతోంది.

వరుస ఘటనలతో ఉలిక్కిపడిన నగరాలు

ఇటీవల మియాపూర్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న వృద్ధురాలి బంగారు గొలుసును క్యాబ్ డ్రైవర్ లాక్కున్నాడు. పేట్ బషీరాబాద్‌లో అంతరాష్ట్ర దొంగల ముఠాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేసి, వారి మీద 62 కేసులున్నట్లు పోలీసులు తేల్చారు. కూకట్‌పల్లిలో 24 గంటల్లోనే గొలుసు చోరీ కేసును పోలీసులు పరిష్కరించారు. జూబ్లీహిల్స్‌లో ప్రేమికుల ముసుగులో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన కేసులో నిందితులను అరెస్ట్ చేశారు. అఫ్జల్‌గంజ్‌లో బంగారు ఆభరణాలను దొంగిలించిన వ్యక్తిని అరెస్ట్ చేసి, 17 తులాల బంగారం రికవరీ చేశారు.

ఢిల్లీ ముఠాకు చెందిన వ్యక్తులు డెలివరీ బాయ్స్‌లా నటిస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గత సోమవారం రాత్రి వరంగల్, హనుమకొండ నగరాల్లో వరుసగా మూడు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లు జరగడం కలకలం రేపింది.

వరంగల్ లేబర్ కాలనీ, క్రిస్టియన్ కాలనీలో ఇంటి ముందు కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్న న్యాయవాది వివేకానంద మెడలో నుంచి తులంన్నర బంగారు గొలుసును ముగ్గురు దుండగులు లాక్కెళ్లారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఇదే తరహాలో మూడు నెలల క్రితం సుబేదారి ఎక్సైజ్ కాలనీలో ఉదయం ముగ్గు వేస్తున్న ఓ మహిళ మెడలోని గొలుసును ఇద్దరు వ్యక్తులు అపహరించారు. తాజాగా కాశీబుగ్గ సొసైటీ కాలనీలో ఇంటి ముందు పిల్లలకు అన్నం తినిపిస్తున్న మహిళ మెడలో నుంచి గొలుసును లాక్కెళ్లడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది.

ఈ ఘటనలపై స్థానిక పోలీసులతో పాటు సీసీఎస్ బృందాలు దర్యాప్తు వేగవంతం చేశాయి. నిందితులు ప్రయాణించిన మార్గాల్లోని కెమెరాలను పరిశీలిస్తూ వారి కదలికలను ట్రాక్ చేస్తున్నారు. వాహనాలు చోరీ అయిన ప్రాంతాల్లో నమోదైన కేసుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 13 చైన్ స్నాచింగ్ కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

చైన్ స్నాచింగ్లు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు అధికంగా బంగారు ఆభరణాలు ధరించకపోవడం మంచిదని చెబుతున్నారు. ఇంటి ముందు, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం ద్వారా నేరాలను కొంతవరకు అరికట్టవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల సహకారం ఉంటేనే ఇలాంటి ముఠాలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడం సాధ్యమవుతుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply