Telangana Heat Wave | రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు

Telangana Heat Wave | రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు
Telangana Heat Wave | ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
వడగాలులతో 10 మంది మృతి
ప్రజలకు కీలక హెచ్చరికలు
పాఠశాలలు, కార్మికులపై ప్రత్యేక సూచనలు
వర్షాల సూచనతో వాతావరణ శాఖ అంచనా
Telangana Heat Wave | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణలో ఇప్పటికే ఎండలు మండుతున్నాయి. కాగా, రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధిక ఎండ తీవ్రతతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
రాష్ట్రంలో మండుతున్న ఎండలతో వాతావరణం నిప్పుల కొలిమిగా మారింది. ఎండ వేడిమితో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రత క్రమంగా పెరగడంతో వారం రోజులుగా పలు జిల్లాల్లో వడగాలులు అత్యధికంగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. ప్రచండ భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ ఇచ్చింది. వచ్చే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భానుడి భగభగలు ఉండబోతున్నాయని, ఎండల తీవ్రతతో వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఆదివారం మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో 41-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సోమవారం ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను నోడల్ అధికారులుగా నియమిస్తూ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం. దానకిశోర్ ఆదేశాలు జారీ చేశారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి వైద్య, రెవెన్యూ, పంచాయతీరాజ్, నగరపాలక, మిషన్ భగీరథ, అగ్నిమాపక, కార్మిక శాఖల ఆధ్వర్యంలో ఉపశమన చర్యలు చేపట్టాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.
10 మంది మృత్యువాత..
ఐదు రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో వడగాలులతో సంబంధిత రుగ్మతల కారణంగా 10 మందికిపైగా మృత్యువాత పడ్డారు. రానున్న ఆరు రోజులు మరింత అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయనే అధికారుల సూచనల నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో వీలైనంతవరకు నీడలో ఉండాలని, బయటకు రావొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు వేడిగాలులు (హీట్‌వేవ్స్) వీచే అవకాశాలున్నాయని, తప్పనిసరిగా బయటకు వెళితే తలకు కర్చీఫ్ ధరించాలని, చలువ కళ్లజోళ్లు పెట్టుకోవాలని, తరచూ నీళ్లు తాగాలని సూచించారు.

ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజులు వేడిగాలులు నమోదైన ప్రాంతాలను ‘రెడ్ అలర్ట్ జోన్’లుగా పరిగణించాలని నిర్ణయించారు. ఈ ప్రాంతాల్లో తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా ప్రభుత్వ శాఖలు దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది.
ప్రధానంగా పాఠశాలల పనివేళలు కుదించాలి లేదా తరగతులను రద్దు చేయడం ఉత్తమమని సూచించారు. విద్యార్థులు సమయానికి నీళ్లు తాగేలా విద్యాలయాల్లో నీటి గంటలు కొట్టాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీ, చల్లదనం కల్పించే చర్యలు తీసుకునే విధంగా విద్యాశాఖను అప్రమత్తం చేయాలని విపత్తుల నిర్వహణ శాఖ కలెక్టర్లను ఆదేశించింది. దీంతో పాటు పలు చర్యలను సూచించింది. పలుచోట్ల కూలింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలి. బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో షెడ్లు నిర్మించాలి. వడగాలుల ముప్పున్న ప్రాంతాలు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే చోట్ల చలివేంద్రాలు, మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ చేపట్టాలి.
వడగాలులకు సంబంధించిన కేసులు ఆస్పత్రుల్లో నమోదైతే ప్రభుత్వానికి వెంటనే సమాచారం ఇవ్వాలి. బాధితులకు ఐస్ ప్యాక్స్, కూలర్లు, ఏసీలు ఏర్పాటు చేసి ఉపశమనం కల్పించాలి. ఎండవేళ కార్మికులు విశ్రాంతి తీసుకునేలా చర్యలు చేపట్టాలి. భవన నిర్మాణాలు, ఇతర నిర్మాణ ప్రదేశాల్లో చల్లని నీళ్లు, నీడ ప్రాంతాలను ఏర్పాటు చేయాలి.
ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
బంగాళాఖాతంలో నెలకొన్న గాలి విచ్ఛిన్నతితో రాష్ట్రంలో ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం వడగాలుల ప్రభావంతో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశంతో ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో సోమవారం 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
ఈ మేరకు కామారెడ్డి, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, జనగామ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
