అధికార పార్టీకి ధీటుగా టిఆర్ఎస్ పోరాట బాట

అధికార పార్టీకి ధీటుగా టిఆర్ఎస్ పోరాట బాట

  • వచ్చే ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్న నాయకత్వం
  • పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పాదయాత్ర..?

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయాలనే డిమాండ్‌తో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే జూన్ నెలలో ప్రణాళికాబద్ధంగా ఈ పాదయాత్ర నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం.

ప్రాజెక్టుల అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకుని పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలను చైతన్యపరిచేందుకు టీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ముఖ్యంగా రైతాంగాన్ని లక్ష్యంగా చేసుకుని సాగునీటి సమస్యలపై ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల మొక్కజొన్న రైతుల సమస్యలపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 నెలలు గడుస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ హామీలు అమలు కాలేదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది.

రైతుబంధు సహా పలు రైతాంగ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలతో ప్రజా పోరాటాలకు సిద్ధమవుతోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న టీఆర్ఎస్, గత ఆరు నెలలుగా మళ్లీ పార్టీ కార్యక్రమాలను చురుకుగా నిర్వహిస్తోంది.

మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో వివాహాలు, శుభకార్యాలు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ ఉనికిని కొనసాగిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, కొత్త కమిటీలు, యువతకు ప్రాధాన్యత వంటి అంశాలపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ పునర్వ్యవస్థీకరణ పనులు కొనసాగుతున్నాయి.

ఇటీవల మహబూబ్‌నగర్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కలిసి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని కేసీఆర్‌తో చర్చించి తుది తేదీలను ప్రకటిస్తామని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వస్థలం అయిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే ఈ పాదయాత్ర చేపట్టాలని టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా భావిస్తోంది. నార్లాపూర్, ఏదుల, వట్టెం, ఉదండాపూర్, కరివేన రిజర్వాయర్ల మీదుగా పాదయాత్ర సాగించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలనే డిమాండ్‌తో ఈ పాదయాత్ర నిర్వహించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినా ప్రాజెక్టు పూర్తి విషయంలో చిత్తశుద్ధి చూపలేదని ఆరోపిస్తూ ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.

Leave a Reply