Massive Robbery | పని మనిషి కల్పన ముఠా పాత్రపై పోలీసుల ఫోకస్

Massive Robbery | పని మనిషి కల్పన ముఠా పాత్రపై పోలీసుల ఫోకస్

Massive Robbery | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రాయ్ భార్య హత్య, భారీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పని మనిషి కల్పన తన అనుచరులతో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం నిందితులు నగరాన్ని వీడి పారిపోయిన తీరు, వారి కదలికలు ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి.

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో పరారీ.. కాజీపేటలో దిగిన ముఠా

పోలీసుల ప్రాథమిక విచారణలో హత్య, దోపిడీ అనంతరం కల్పన ముఠా నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో పారిపోయినట్లు తేలింది. అనంతరం వారు కాజీపేటలో దిగినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి ఎవరెవరు ఎటు వెళ్లారు? రాష్ట్ర సరిహద్దులు దాటారా? లేక దేశంలోనే తలదాచుకున్నారా? అనే కోణాల్లో ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. నిందితులు ఇప్పటివరకు నేపాల్ చేరుకోలేదని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

నేపాల్ గ్యాంగ్ లీడర్ నేత్ర సాహూపై అనుమానం

ఈ కేసులో నేపాల్‌కు చెందిన నేత్ర బహదూర్ సాహి అలియాస్ నేత్ర సాహూ పాత్ర ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశంలోని పలు నగరాల్లో పనిచేస్తున్న నేపాల్ దొంగల ముఠాలకు అతడే నాయకత్వం వహిస్తున్నట్లు గతంలోనే పోలీసులు గుర్తించారు. బతుకు దెరువు కోసం భారత్‌కు వచ్చిన పని మనుషులను టార్గెట్ చేస్తూ, ధనికుల ఇళ్లలో పనిచేసేవారి వివరాలు సేకరించడం అతడి ప్రధాన వ్యూహమని సమాచారం.

మత్తుమందుతో దోపిడీలకు స్కెచ్

నేత్ర సాహూ ముఠా ముందుగా పని మనుషుల ద్వారా ఇళ్ల యజమానుల జీవనశైలిపై సమాచారం సేకరిస్తుందని పోలీసులు చెబుతున్నారు. అనంతరం భోజనంలో మత్తుమందు కలిపి యజమానులను స్పృహ తప్పేలా చేసి, భారీ దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలుతోంది. దోపిడీకి రెండు రోజుల ముందే తన అనుచరులను నగరానికి పంపించి, మొత్తం ఆపరేషన్‌ను పక్కాగా ప్లాన్‌ చేస్తాడని సమాచారం. ఈ కేసులో కల్పన ముఠాకు కూడా నేత్ర సాహూ ఆశ్రయం కల్పించి ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.

Massive Robbery

Leave a Reply