అవకతవకలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

అవకతవకలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

  • ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

కుంటాల, ఆంధ్రప్రభ : రైతులకు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సొసైటీ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రం కుంటాలంతో పాటు అంబకంటి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కుంటాల కేంద్రంలో రైతులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకువచ్చారు. గన్నీ సంచుల కొరత, లారీల కొరత పేరుతో కొందరు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆరుగాలం శ్రమించి పండించిన రైతుల ధాన్యంపై దోపిడీ చేయడం సరికాదన్నారు.

రైతుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారమే ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు అన్యాయం జరిగితే సహించబోనని స్పష్టం చేశారు.

సొసైటీ సీఈఓ మహేష్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, విధుల్లో నిర్లక్ష్యం కొనసాగితే సస్పెన్షన్‌కు కూడా వెనుకాడబోమన్నారు. అధికారుల తప్పుదోవ కారణంగానే రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు.

గన్నీ సంచుల కొరతపై రైతులు చేసిన ఫిర్యాదుకు స్పందించిన ఎమ్మెల్యే, ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు.

టోకెన్ నంబర్ల ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని, కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు. అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతుల ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేసి గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు అన్యాయం జరిగితే తాను ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి పోరాడతానని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల గజేందర్, ముజ్జిగే రాణి ప్రదీప్ కుమార్, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జరం, డీసీసీబీ డైరెక్టర్ తూర్పాటి వెంకటేష్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జుట్టు అశోక్, మాజీ సొసైటీ చైర్మన్ జుట్టు లక్ష్మణ్, మాజీ ఎంపీపీ ఆప్కా గజ్జరం యాదవ్, జివి రమణారావు, నాలం శ్రీనివాస్, సొసైటీ సీఈఓ మహేష్, ఏఎంసీ డైరెక్టర్లు సాయికుమార్, మహిపాల్, ఆయా గ్రామాల సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు, రైతులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply