బిచ్కుంద సెక్టార్‌లో బస్సు సర్వీసులు పెంచాలి..
బిచ్కుంద, ఆంధ్రప్రభ : ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే బిచ్కుంద సెక్టార్‌లో రాజధాని బస్సు సర్వీసులు అధికంగా ఉండగా, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులు మాత్రం నామమాత్రంగా నడుస్తున్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రజలు బిచ్కుంద – బాన్సువాడ మార్గంలో నిత్యం ప్రయాణాలు సాగిస్తున్నప్పటికీ సరిపడా బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బిచ్కుంద బస్టాండ్‌లో కంట్రోలర్ విధులు నిర్వహిస్తే బస్సుల రాకపోకలు సక్రమంగా జరిగే అవకాశం ఉంటుందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్నప్పటికీ, తగిన సంఖ్యలో సర్వీసులు నడపకపోవడం వల్ల ప్రయోజనం పూర్తిగా అందడం లేదని అంటున్నారు.
గతంలో బాన్సువాడ – జుక్కల్ లోకల్ సర్వీసులు, బిచ్కుంద – బాన్సువాడ లోకల్ బస్సులు నడవడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని తెలిపారు. అలాగే కామారెడ్డి – జుక్కల్ గుల్ల సర్వీస్, బాన్సువాడ – దేగ్లూర్ బస్సులు నడిచినప్పుడు రద్దీ తక్కువగా ఉండేదని గుర్తు చేశారు.
గత పది రోజులుగా బిచ్కుంద బస్టాండ్‌లో కంట్రోల్ సిబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల ప్రయాణికులు అధికంగా వినియోగించే ప్రధాన బస్టాండ్‌గా ఉన్న బిచ్కుంద సెక్టార్‌లో బస్సు సర్వీసులను పెంచి ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఆర్టీసీ అధికారులను స్థానికులు కోరుతున్నారు.
