మైనర్ బాలిక అత్యాచార ఘటనపై నిరసన

మైనర్ బాలిక అత్యాచార ఘటనపై నిరసన
బండి భగీరథను వెంటనే అరెస్ట్ చేయాలని అఖిలపక్ష నేతల డిమాండ్
గద్వాల (ప్రతినిధి), ఆంధ్రప్రభ: మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని గద్వాల అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగాయని ఆరోపించారు. పోక్సో కేసు నమోదైన 48 గంటల్లోపు నిందితుడిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం ప్రభుత్వ మెతక వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
కేంద్రమంత్రి కుమారుడిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాజకీయ పలుకుబడితో కేసును నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, బాధిత కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చతెస్తోందని మండిపడ్డారు. “బేటీ పడావో – బేటీ బచావో” నినాదం కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు.
మహిళల పట్ల నిజంగా గౌరవం ఉంటే కేంద్రమంత్రి బండి సంజయ్‌ను కేంద్ర క్యాబినెట్ నుంచి తొలగించి, బండి భగీరథును వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
