NH-44 | పెనుకొండ.. వైభవం!

NH-44 | పెనుకొండ.. వైభవం!
NH-44 | రాయలసీమ భవిష్యత్ మహానగరం
చారిత్రాత్మకం, ఆధ్యాత్మికం, పర్యాటకం సమ్మేళనం
బెంగళూరు,హైదరాబాద్ మెట్రో నగరాల సరసన పెనుకొండ
NH-44 | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణం ఇప్పుడు చరిత్ర, ఆధ్యాత్మికత, పారిశ్రామిక అభివృద్ధి, రవాణా సదుపాయాల సమ్మేళనంగా వేగంగా రూపాంతరం చెందుతోంది. విజయనగర సామ్రాజ్యానికి రెండవ రాజధానిగా చారిత్రక గుర్తింపు పొందిన పెనుకొండ, ప్రస్తుతం రాయలసీమలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా మారుతోంది. పరిశ్రమలు, విద్యాసంస్థలు, రవాణా సౌకర్యాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఒకే ప్రాంతంలో సమీకృతం కావడంతో పెనుకొండ భవిష్యత్ మహానగరంగా రూపుదిద్దుకుంటోందని స్థానికులు, పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కియాతో మొదలైన మార్పు
పెనుకొండ అభివృద్ధికి ప్రధాన బలం కియా ఇండియా కార్ల తయారీ సంస్థ. కియా ఇండియా ప్లాంట్ ఏర్పాటుతో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించింది. కియా సంస్థతో పాటు అనుబంధ ఆటోమొబైల్ కంపెనీలు కూడా పెనుకొండ పరిసర ప్రాంతాల్లో స్థాపన కావడంతో ఈ ప్రాంతం ఆటోమొబైల్ పరిశ్రమల కేంద్రంగా మారుతోంది. విడిభాగాల తయారీ యూనిట్లు, సరఫరా సంస్థలు, గిడ్డంగులు ఏర్పడటం వల్ల పారిశ్రామిక కార్యకలాపాలు మరింత వేగం అందుకున్నాయి.
లాజిస్టిక్స్ హబ్ గా..
ఇక లాజిస్టిక్స్ రంగంలో కూడా పెనుకొండకు ప్రాధాన్యం పెరుగుతోంది. నేషనల్ హైవే-44 పై వ్యూహాత్మక స్థానం కలిగి ఉండటంతో భారీ లాజిస్టిక్స్ పార్క్ అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌హెచ్-44ను ఆరు లైన్ల రహదారిగా విస్తరిస్తుండటం వల్ల రవాణా మరింత సులభతరం కానుంది. బెంగళూరు, హైదరాబాద్, అనంతపురం, కర్నూలు వంటి నగరాలకు వేగవంతమైన రోడ్డు అనుసంధానం పెనుకొండకు ప్రత్యేక బలం.
సమీపంలోనే విమానాశ్రయం
పెనుకొండ సమీపంలో ఉన్న దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం గంట ప్రయాణ దూరంలో ఉండటం పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. అదేవిధంగా భవిష్యత్‌లో బుల్లెట్ ట్రైన్ మార్గం ఈ ప్రాంతం మీదుగా వెళ్లే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే పెనుకొండ రైల్వే జంక్షన్ ప్రాధాన్యం పెరుగుతుండగా, భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని సదుపాయాలు అభివృద్ధి చెందనున్నాయి.
విద్యా, వైద్య రంగాలలో కూడా
పరిశ్రమలతో పాటు విద్య, వైద్య రంగాల్లో కూడా పెనుకొండ పురోగమిస్తోంది. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో వైద్య సేవలు విస్తరించే అవకాశం ఉంది. కేంద్రీయ విద్యాలయం, నాసిన్ అకాడమీ వంటి విద్యాసంస్థలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ హబ్ అభివృద్ధి దిశగా కూడా చర్యలు కొనసాగుతుండగా, రేమండ్స్ కంపెనీ ప్రాజెక్ట్ ప్రాంతీయ పారిశ్రామిక వృద్ధికి కొత్త ఊపు తీసుకురానుంది.
ఆధ్మాత్మికంగా..
ఆధ్యాత్మిక రంగంలో కూడా పెనుకొండకు విశేష గుర్తింపు లభిస్తోంది. పెనుకొండ కొండపై ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక పురాతన దేవాలయాలతో ప్రసిద్ధి చెందిన పెనుకొండను “దేవాలయాల నగరం”గా కూడా పిలుస్తున్నారు. చారిత్రక కోట, ఆలయాలు, రాజవంశాల ఆనవాళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
గొల్లపల్లి డ్యామ్ వంటి నీటి వనరులు ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. వేసవి కాలంలో ఆహ్లాదకర వాతావరణం ఉండటంతో పెనుకొండను “వేసవి విడిది కేంద్రం”గా అభివృద్ధి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యాటక, ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం కలగలిపి పెనుకొండను ప్రముఖ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయి. కియా ఇండియా ప్లాంట్ నుంచి కొడికొండ వరకు పట్టణ విస్తరణ వేగంగా కొనసాగుతోంది. నివాస కాలనీలు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, హోటళ్లు, పారిశ్రామిక పార్కులు వరుసగా అభివృద్ధి చెందుతున్నాయి.
రాబోయే కాలంలో ఈ విస్తరణ మరింత వేగం అందుకునే అవకాశముందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు భావిస్తున్నారు. చారిత్రక వారసత్వం, పారిశ్రామిక ప్రగతి, ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆధునిక మౌలిక వసతులు అన్నీ ఒకే చోట కలుస్తున్న అరుదైన ప్రాంతంగా పెనుకొండ నిలుస్తోంది. రాబోయే దశాబ్దాల్లో రాయలసీమలోనే అతిపెద్ద పారిశ్రామిక, ఆధ్యాత్మిక, పర్యాటక నగరంగా పెనుకొండ ఎదగబోతోందన్న ఆశాభావం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
