Rs.1.06LakhCrore | రైల్వే శాఖ.. వరాల మాల !

Rs.1.06LakhCrore | రైల్వే శాఖ.. వరాల మాల !
Rs.1.06LakhCrore | ఏపీకి బడ్జెట్లో రూ.10,134 కోట్లు
కొనసాగుతున్న రూ.1.06 లక్షల కోట్ల రైల్వే ప్రాజెక్ట్ పనులు
అమరావతి కేంద్రంగా రెండు బుల్లెట్ ట్రైన్స్
ఏపీ మీదుగా 16 వందేభారత్, 22 అమృత్ భారత్ రైళ్లు
74 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం
వివరాలు వెల్లడించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
Rs.1.06LakhCrore | అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్లోరైల్వే రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ముఖ్యంగా అమరావతిని కేంద్రంగా చేసుకుని రెండు బుల్లెట్ ట్రైన్ కారిడార్లను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు రూ.1.06 లక్షల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులతో రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పోర్టులు, పర్యాటక ప్రాంతాల మధ్య రాకపోకలు మరింత సులభం అవుతాయన్నారు.
విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అశ్విని వైష్ణవ్.. రాష్ట్రానికి గతంతో పోలిస్తే ఈసారి రైల్వే బడ్జెట్ లో భారీ పెరిగిందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి రూ.886 కోట్లు మాత్రమే కేటాయించగా, ఇప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రూ.10,134 కోట్ల వరకు నిధులు మంజూరయ్యాయని వివరించారు. రాష్ట్ర రైల్వే అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను చూపుతోందన్నారు.
ఏపీకి 16 వందేభారత్, 22 అమృత్ భారత్ రైళ్లు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రయాణికుల కోసం 16 వందే భారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. అదనంగా 22 అమృత్ భారత్ రైళ్లు కూడా నడుస్తున్నాయని చెప్పారు. ఈ రైళ్ల ద్వారా ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆధునిక సదుపాయాలతో కొత్త తరహా రైల్వే సేవలు అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణికుల స్పందన కూడా పెరుగుతోందని చెప్పారు.
74 రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం
రాష్ట్రంలోని 74 రైల్వే స్టేషన్లను ఆధునికీకరిస్తున్నట్లు కూడా మంత్రి వైష్ణవ్ వెల్లడించారు. ఈ స్టేషన్లను పూర్తిగా పునర్నిర్మించి, ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. దేశంలోనే ఒకేసారి ఇంత పెద్ద స్థాయిలో స్టేషన్ రీడెవలప్మెంట్ జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు. రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే 832 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ ల నిర్మాణం పూర్తయిందన్నారు. మరో 299 పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే 1,759 కిలోమీటర్ల కొత్త రైల్వే ట్రాక్ పనులు పూర్తయ్యాయని, ఇంకా 3,300 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ నిర్మాణం కొనసాగుతోందని వివరించారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలు మరింత వేగవంతం అవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 100 శాతం రైల్వే విద్యుద్దీకరణ సాధించిందని మంత్రి చెప్పారు. దీంతో ఆధునిక రైల్వే వ్యవస్థ అమలులో రాష్ట్రం దేశంలో ముందున్న ప్రాంతాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. అటు ఈస్ట్ కోస్ట్ రైల్వే కారిడార్‌ను నాలుగు లైన్ల నెట్వర్క్ గా విస్తరించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. దీని వల్ల రైల్వే సామర్థ్యం రెట్టింపు కావడంతో పాటు భవిష్యత్తులో 500 కొత్త రైళ్లను నడపడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.
ఏపీకి బుల్లెట్ రైలు కారిడార్లు
భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ సేవలు ప్రారంభమైతే దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గుతుందని మంత్రి వైష్ణవ్ వివరించారు. అమరావతి నుంచి హైదరాబాద్‌కు సుమారు 70 నిమిషాల్లో, చెన్నైకి 112 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. అలాగే హైదరాబాద్ నుంచి పూణేకు రెండు గంటల లోపు, బెంగళూరుకు కూడా దాదాపు రెండు గంటల్లో చేరుకునే అవకాశం ఉందన్నారు.
