3.60 cr | ఒక్కో ఫ్యామిలీకి గంట సమయం

3.60 cr | ఒక్కో ఫ్యామిలీకి గంట సమయం
ప్రతి కట్టడానికీ ప్రత్యేక నెంబర్
స్వీయగణనలో అంతంత మాత్రమే నమోదు
తెలంగాణలో 3.60 కోట్ల జనాభా అంచనా
ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోని ఐటీ ఉద్యోగులు
జూన్ 9వరకు కొనసాగనున్న ఇంటింటి ప్రక్రియ
3.60 cr | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో జనాభా 3.86 కోట్ల వరకు ఉంటుందని జనాభా లెక్కల విభాగం ప్రాథమికంగా అంచనా వేసింది. దీన్నే ప్రాతిపదికగా తీసుకుని జనాభా లెక్కల సేకరణ మొదటి దశ కార్యక్రమంలో భాగంగా ప్రత్యక్షంగా ఇంటింటి వివరాల నమోదు ప్రారంభమైంది. ఈ జనాభా లెక్కలు జూన్ 9వ తేదీ వరకు ప్రతి ఇల్లు, కట్టడం, వాటిలో ఉన్న సౌకర్యాలు, కుటుంబ యజమాని పేరు, సెల్ నంబరును గణకులు సేకరిస్తారు. దీనిలో భాగంగా మే 11 నుంచి మూడు రోజుల పాటు ప్రతి గణకుడు తనకు కేటాయించిన ప్రాంతమంతా తిరిగి ప్రతి కట్టడం గోడపై జనగణన నంబరు వేయాలి. మూడు రోజుల తర్వాత మళ్లీ ప్రతి ఇంటికీ వెళ్లి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. గత నెల 26 నుంచి ఈ నెల 10 వరకు స్వీయగణనకు కేంద్రం అవకాశం కల్పించింది. కానీ దీనిలో కేవలం 5.20 లక్షల కుటుంబాలే నమోదు చేసుకున్నాయి. విశేషమేంటంటే మే 10వ తేదీన ఒక్కరోజే 1.50 లక్షల కుటుంబాలు స్పందించి వివరాలు నమోదు చేశాయని జనాభా లెక్కల సేకరణ అధికారులు పేర్కొన్నారు.

3.60 cr | స్వీయగణనలో అంతంతమాత్ర నమోదు..
ఎంతో కీలకమైన జనాభా లెక్కల సేకరణలో స్వయంగా భాగస్వామ్యం పంచుకునేందుకు రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి తక్కువగానే కనిపించింది. రాష్ట్రంలో ఏప్రిల్ 26న ప్రారంభమైన స్వీయగణన (వ్యక్తిగత నమోదు/ సెల్ఫ్ ఎన్యూమరేషన్-ఎన్ఈ) ప్రక్రియ మే 10వ తేదీన ముగిసింది. అయితే ఈ నెల 9 వరకు 3.70 లక్షల కుటుంబాలు తమ వివరాలను సొంతంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయగా, చివరి రోజు ముగిసేసరికి ఆ సంఖ్య 5.20 లక్షలకు చేరింది. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్, హరియాణా, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఇలా తదితర రాష్ట్రాల్లో ఎస్ఈలో 85 లక్షల కుటుంబాలు సొంతంగా వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాయి. తెలంగాణ జనాభా సుమారు 3.60 కోట్లకు పైగా ఉంటుందని, దానిలో కుటుంబాల సంఖ్య 1.30 కోట్లని అనధికారిక అంచనా. వీరిలో పది శాతం కుటుంబాలైనా సొంతంగా వివరాలను నమోదు చేస్తాయని వేసిన అధికారుల అంచనాలు నెరవేరలేదు. ఎస్ఈ ప్రక్రియ స్వచ్ఛందమని ప్రకటించడంతో 97 శాతం మంది ఈ జనాభా లెక్కలను సీరియస్‌గా తీసుకోలేదని అధికారులు భావిస్తున్నారు.
3.60 cr | 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నా..
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారు. వారిలో సగం వరకైనా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయకపోవడంపై కేంద్ర జనాభా లెక్కల విభాగం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఇక ఐటీ రంగ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోకి వచ్చే హైదరాబాద్ నగర ప్రాంతాల్లోనే పని చేస్తున్నారు. కానీ ఈ రెండు జిల్లాల్లో 76 వేల మంది మాత్రమే ఆన్‌లైన్‌లో తమ కుటుంబ వివరాలను నమోదు చేశారు. ఇక అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 42,982, అత్యల్పంగా ములుగులో 1,556 కుటుంబాలు మాత్రమే వివరాలను నమోదు చేశాయి. ఇక రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో కనీసం 5 వేల కుటుంబాలు కూడా ముందుకు రాలేదు.
జూన్ 9వ తేదీ వరకు ..
ఇంట్లో ఉన్న సౌకర్యాలు, గ్రామ, మండల, జిల్లా వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించి నమోదు చేసేందుకు ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు జనగణకులు ఇంటింటికీ రానున్నారు. ఈ జనగణకు ఒక్కో కుటుంబం వద్ద దాదాపు గంట నుంచి రెండు గంటలకుపైగా సమయం పడుతుంది.
CLICK HERE TO READ MORE : 120dollars | ప్రధాని మోదీ ఏడు సూత్రాలు
