58 cases | వివాహ బలిపీఠంపై చిన్నారులు

58 cases | వివాహ బలిపీఠంపై చిన్నారులు
చట్టాలున్నా ఆగని దురాచారం
పెరుగుతున్న చిన్నారి పెళ్లికూతుళ్లు
తల్లిదండ్రుల్లో కొరవడిన చైతన్యం
58 cases | పల్నాడుబ్యూరో, ఆంధ్రప్రభ : పుస్తకాలు చేతపట్టాల్సిన అభం శుభం తెలియని పసి మొగ్గలు మెడలో పసుపు తాడుతో మరొకరి వెంట నడుస్తున్నారు. చిరు ప్రాయంలోనే పురిటి నొప్పులు పడుతున్నారు. సామాజిక దురాగతాలు, పేదరికం, తల్లిదండ్రుల అవగాహన లోపం, అఘాయిత్యాల పేరిట వారి బాల్యం నాశనం అవుతోంది. బంగారు భవిష్యత్తు మసకబారుతోంది. చట్టం ఉన్నా అమలు తీరును ఎగ‘తాళి’ చేసింది. వందల మంది బాలికల జీవితాలు బుగ్గిపాలవడం ఆవేదన కలిగిస్తోంది.
చట్టాలు ఉన్నా ఆగని బాల్య వివాహాలు..

2026 ఏప్రిల్ 29వ తేదీ : పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉప్పరపాలెంలో ఓ బాలికకు పెళ్లి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న సమాచారంతో యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. బాలికకు నిశ్చయ తాంబూలాలు చేస్తున్నట్లు ముందురోజు రాత్రి బాలిక బంధువుల నుంచి అందిన ఫోన్ కాల్‌పై తక్షణమే స్పందించారు. బాలిక తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడి, చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలను వివరించారు. ఇటీవల గురజాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. పదో తరగతిలోకి అడుగు పెట్టబోతుండగా ఇక చదువు ఆపేసి పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు చెప్పడంతో కన్నీరుమున్నీరైంది. సమాచారం అందుకున్న అధికారులు వివాహాన్ని నిలిపివేసి, కౌన్సిలింగ్ నిర్వహించారు.

ఇలాంటి సంఘటనలు పల్నాడు జిల్లాలో ఎక్కడో ఒక చోట బాల్య వివాహాలు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతునే ఉన్నాయి. ఆటపాటలు.. కేరింతలు.. తుళ్లింతలు.. గిల్లికజ్జాలు.. అందమైన ఊహలు.. ఇలా ఎన్నో మధురానుభూతుల్లో సాగాల్సిన బాల్యం వివాహ బంధంలో బందీగా మారిపోతోంది . ముక్కుపచ్చలారని పసిమొగ్గలు కుటుంబ బరువు, బాధ్యతల బందీఖానాలో చిక్కి శల్యమైపోతున్నారు. పెళ్లంటే ఏమిటో కూడా తెలియకుండానే చిన్నారుల జీవితాలు శిథిలమైపోతున్నాయి. ఈ దురాచారాన్ని రద్దు చేయాలని భావించి, ఎప్పుడో 150 ఏళ్ల క్రితం 1872లోనే బాల్య వివాహాలను రద్దు చేస్తూ అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం చట్టం చేసినా అది నేటికీ సమాజాన్ని వీడలేదు. బాల్య వివాహాల సంఖ్య ఇటీవల కాలంలో భారీగా పెరుగుతుండడం సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

ఫలితమివ్వని ప్రచారం…
బాల్యవివాహాల నిర్మూలన కోసం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్యవివాహ్ ముక్త్ భారత్, బేటీ బచావో.. బేటీ పడావో, కిశోరి వికాసం, ప్రత్యేక వాహన ప్రచారం సహా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటి నిర్వహణ కోసం జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా రూ. లక్షలు వెచ్చిస్తున్నారు. మండల సమాఖ్య, ఆరోగ్య సిబ్బంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, విద్యాసంస్థలు, ప్రజాప్రతినిధులు, పురోహితులు, పాస్టర్లు, ఇమామ్‌ల వంటి దైవ సేవకులు, షామియానాలు వేసేవారు, ఫొటోగ్రాఫర్లు, భజంత్రీలు వాయించే వారితోపాటు ప్రతి విభాగం వారికీ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రణాళిక ప్రకారం జరగకపోవడం… ఫొటోలు తీసి ఉన్నతాధికారులకు పంపడం, ప్రచార ఆర్భాటానికే పరిమితం కావడం వంటి కారణాలతో ఈ కార్యక్రమాలు ఆశించిన ఫలితం ఇవ్వడం లేదు.
పేరుకే కమిటీలు…
బాల్యవివాహాల నియంత్రణలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు మించిన బాధ్యత చైల్డ్ మ్యారేజ్ ప్రాహిబిషన్ ఆఫీసర్లపై (సీఎంపీఓ) ఉంది. బాల్య వివాహ నిరోధక చట్టం (పీసీఎంఏ)–2006 ప్రకారం, 31,39 జీఓలను అనుసరించి వివిధ స్థాయిల్లో కమిటీలను నియమించారు. జిల్లా ఉన్నతాధికారి సహా డీఆర్‌ఓ ఆధ్వర్యాన జిల్లా స్థాయి .. నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల డివిజన్లలో ఆర్‌డీఓల ఆధ్వర్యాన డివిజన్ స్థాయి … రెండు లేదా మూడు మండలాలకు ఒక బ్లాక్ చొప్పున సీడీపీఓల ఆధ్వర్యాన బ్లాక్ స్థాయి .. ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ, ఎస్‌ఐ, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, జీఎంఎస్‌కేలు, సీఎంపీఓల ఆధ్వర్యాన మండల స్థాయిల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా జీఎంఎస్‌కే నోడల్ అధికారిగా, పంచాయతీ కార్యదర్శి, వీఆర్‌ఓ, మహిళా కార్యదర్శి, స్కూల్ హెచ్‌ఎం, అంగన్‌వాడీ వర్కర్, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ ఇలా 10 మందితో కలిపి ప్రతి గ్రామంలోనూ ఒక చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ కమిటీ కూడా వేశారు. బాల్యవివాహాల నియంత్రణ, నిరోధం కోసం వీటిని ఏర్పాటు చేశారు. పీసీఎంఏ చట్టాన్ని క్షేత్రస్థాయికి చేర్చి, బాల్యవివాహల నియంత్రణలో సీఎంపీఓలు కీలకపాత్ర పోషించాలి. పూర్తిగా నిరోధించాలి. కాని కమిటీల పనితీరు అంతంత మాత్రంగా ఉండటంతోనే బాల్య వివాహాలకు చెక్ పడటం లేదు.
కొనసాగుతున్న అనాచారం..
2024లో 58 కేసులు నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య 70కి పెరగడం గమనార్హం. ఇది రెండు కోణాలను సూచిస్తోంది. ఒకటి, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాల పట్ల అవగాహన లోపించడం. రెండు, నిఘా పెరగడం వల్ల గతంలో బయటకు రాని కేసులు కూడా ఇప్పుడు వెలుగులోకి రావడం. ఇక 2026 ప్రారంభంలోనే (మే నెల నాటికి) 13 కేసులు నమోదవ్వడం చూస్తుంటే, ఈ ఏడు కూడా ముప్పు పొంచి ఉందనే చెప్పాలి. 2024లో నమోదైన 58 కేసుల్లో 55 వివాహాలను అధికారులు అడ్డుకోగలిగారు. 2025లో 70 కేసుల్లో ఏకంగా 67 పెళ్లిళ్లను ఆపివేయడంలో సఫలమయ్యారు. 2026లో ఇప్పటివరకు నమోదైన మొత్తం 13 కేసులను కూడా అధికారులు పెళ్లి జరగకుండానే నిలిపివేశారు.అధికారులు కేవలం పెళ్లిళ్లు ఆపడమే కాకుండా, మొండిగా వ్యవహరించే వారిపై చట్టపరమైన కొరడా కూడా ఝుళిపిస్తున్నారు. గత రెండేళ్లలో (2024, 2025) ఆరు సందర్భాల్లో తీవ్రమైన నేరంగా పరిగణించి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు.
తల్లిదండ్రుల్లో కొరవడిన చైతన్యం…
గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరగడానికి కారణం అవిద్య, అవగాహనాలేమి కారణాలుగా కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే తల్లిదండ్రుల సమస్య వేరేలా ఉంటోంది. సినిమా, టీవీల దుష్ప్రభావాలు, లైంగిక వేధింపులు, అత్యాచారాల నుంచి బయట పడేందుకు తక్కువ వయసులో పెళ్లిళ్లకు తల్లిదండ్రులు పూనుకుంటున్నారు. సమాజాన్ని ఆవరించిన అభద్రతా భావం ఆడపిల్లలకు శాపంగా మారింది. ప్రజల్లో అవగాహన పెంచి, భయం పోగొట్టి, మహిళలకు, ఆడపిల్లల భద్రతకు భరోసా ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటే తప్ప ఈ బాల్య వివాహాలు అడ్డుకోవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.
బాల్య వివాహాలతో నష్టాలు..
బాల్య వివాహాల వల్ల పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటుంది. సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పరిపూర్ణ వ్యక్తులుగా ఎదిగేందుకు అవకాశం, స్వేచ్ఛ లేకుండా పోతుంది. చిన్న వయసులోనే గర్భం దాలిస్తే తల్లీబిడ్డలకు ప్రమాదమే. పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. బాలికల విద్యా హక్కును ఇది కాలరాస్తుంది. పిల్లలు నిరక్షరాశ్యులుగా, నైపుణ్యం లేనివారుగా మిగిలిపోతారు. పల్నాడు జిల్లాలో వ్యవస్థ అప్రమత్తంగా ఉన్నప్పటికీ, సంఖ్యాపరంగా కేసులు పెరుగుతుండటం ఆందోళనకరం. అధికారులు పెళ్లిని ఆపిన తర్వాత ఆ బాలికల భవిష్యత్తు, వారి విద్య , రక్షణపై కూడా నిరంతర పర్యవేక్షణ అవసరమని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. కేవలం పెళ్లిళ్లు ఆపడమే కాకుండా, అసలు వివాహ ప్రయత్నం జరగకుండా చూసేలా సామాజిక చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
CLICK HERE TO READ MORE : 13yrs oldgirl | మియాపూర్‌లో విషాద ఘటన
