బండి సాయి భగీరథను అరెస్టు చేయాలి

బండి సాయి భగీరథను అరెస్టు చేయాలి

  • టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బై కాని శ్రీనివాస్ యాదవ్

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మైనర్ బాలికపై అత్యాచారం, వేధింపుల ఆరోపణల కేసులో బండి సాయి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు చేసి 60 గంటలు గడిచినా ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ తన హోదాను ఉపయోగించి కుమారుడిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన శ్రీనివాస్ యాదవ్, వెంటనే బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

“ఒకవైపు ‘బేటీ బచావో, బేటీ పడావో’ అంటూ నినాదాలు ఇస్తూ, మరోవైపు మహిళా సాధికారత గురించి మాట్లాడుతున్న ప్రభుత్వాలు ఈ విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నాయి?” అని ఆయన ప్రశ్నించారు.

హోంమంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకుని బండి సాయి భగీరథ్‌ను అరెస్టు చేయించి మహిళల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన కోరారు.

లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతుందని బైకాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.