ఎస్టీ రిజర్వేషన్లకు 50 ఏళ్లు

  • అచ్చంపేటలో ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర
  • లక్ష్మాపూర్ తండాలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ
  • గిరిజన సంక్షేమమే లక్ష్యమన్న నాయకులు

అచ్చంపేట, ఆంధ్రప్రభ : ఎస్టీలకు లంబాడీ, ఎరుకల, యానాది తదితర గిరిజన వర్గాలకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రిజర్వేషన్లు కల్పించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర’ శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గానికి చేరుకుంది.

నాగర్‌కర్నూల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో బస్సు యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం బస్సు యాత్ర బృందం అచ్చంపేట మండలం లక్ష్మాపూర్ తండాను సందర్శించింది.

ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ జెండాను ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఎమ్మెల్యే బాలు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్‌తో పాటు గిరిజన నాయకులు ఆవిష్కరించారు.

అనంతరం నిర్వహించిన సభలో నాయకులు మాట్లాడుతూ.. గిరిజన వర్గాల సామాజిక, విద్యా, ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ కల్పించిన ఎస్టీ రిజర్వేషన్లు గిరిజనుల అభ్యున్నతికి బాటలు వేసాయని, అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.