‘పవన్‌ను జాగ్రత్తగా చూసుకుంటా’ అంటూ పోస్ట్ వైరల్‌

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్యం గురించి ప్రధాని ప్రత్యేకంగా ఆరాతీశారు. ఈ సందర్భంగా పవన్ కుటుంబంతో కొంతసేపు గడిపిన మోడీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా మోడీతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. “ప్రధాని మా ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజును జీవితంలో మర్చిపోలేను. నా భర్తను జాగ్రత్తగా చూసుకుంటానని ఆయనకు ప్రామిస్ చేశాను” అంటూ భావోద్వేగ క్యాప్షన్ ఇచ్చారు.

ప్రధాని కూడా ఎక్స్ వేదికగా పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ప్రధాని వ్యక్తిగతంగా ఇంటికి వచ్చి పరామర్శించడంపై కృతజ్ఞతలు తెలిపారు. “ప్రధాని మాతో గడిపిన విలువైన సమయం జీవితాంతం గుర్తుండిపోతుంది” అని పవన్ తన పోస్టులో పేర్కొన్నారు.