జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ

  • వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలి
  • విధుల నిర్వహణ సక్రమంగా చేయాలి
  • వైద్య సేవలపై కలెక్టర్ ఆరా
  • రోగులకు మెరుగైన వైద్యసేవలు
  • ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి,
  • పరిశుభ్రతపై చర్యలు తీసుకోవాలి రోగుల ఫిర్యాదు
  • జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి వివిధ రోగాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆదేశించారు. సోమవారం ఉదయం 7 గంటలకే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించిన కలెక్టర్, విధుల్లో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరు వివరాలను తెలుసుకున్నారు. డ్యూటీల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకూడదని హెచ్చరించారు.

రోగులకు సమయానికి వైద్యం అందించడంతో పాటు అత్యవసర సేవలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్ల వద్దకు వెళ్లిన కలెక్టర్, వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య సేవలపై స్వయంగా ఆరా తీశారు. మందులు సమయానికి అందుతున్నాయా, డాక్టర్లు క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నారా, వసతులు ఎలా ఉన్నాయనే అంశాలపై రోగులను ప్రశ్నించారు. కొంతమంది రోగులు ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగ్గా అందుతున్నాయని చెప్పగా, మరికొందరు పరిశుభ్రత విషయంలో మరింతగా దృష్టి పెట్టాలని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను పరిశీలించిన కలెక్టర్, ఆసుపత్రి ప్రాంగణం, వార్డులు, మరుగుదొడ్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సానిటేషన్ నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి, ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. రోగులు మరియు వారి సహాయకులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం ఆసుపత్రి వైద్యాధికారులు బాధ్యత అని, తాను మళ్లీ వచ్చే సందర్శన వరకు పరిశుభ్ర వాతావరణంలో ఉండాలని, లేనియెడల కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలని, అదేవిధంగా ఆసుపత్రికి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సరైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం ప్రతి ఉద్యోగి బాధ్యత, ప్రభుత్వ ఆసుపత్రిలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు
జిల్లా కలెక్టర్ వెంట ఆస్పత్రి సూపర్ డెంటెంట్ ఉషారాణి, డాక్టర్ రోహిత్, వైద్యులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.