అభివృద్ధికి సహకరించండి..
అభివృద్ధికి సహకరించండి..
- రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే బైపాస్ రోడ్డు
- 12.1 కిలోమీటర్ల దూరంతో 82 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మాణం
- ప్రభుత్వ విప్ విజయరమణ రావు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ ; రాజకీయాలకతీతంగా పెద్దపల్లి ని అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తున్నామని ప్రతి ఒక్కరు సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పెద్దకల్వల వద్ద 82 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించే బైపాస్ రోడ్డు నిర్మాణానికిశంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి సహకరించాలని పార్టీలకు అతీతంగా బైపాస్ రోడ్డు నిర్మాణానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి నియోజకవర్గానికి 82 కోట్లతో బైపాస్ రోడ్డు మంజూరు చేయడం శుభ సూచకం అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి మంత్రుల సహకారంతో చేయడం జరుగుతుందన్నారు. పెద్దపల్లి లో ఎన్నడు లేని విధంగా బస్సు డిపో, జిల్లా కోర్టు భవనం, డబల్ లైన్ రోడ్ల నిర్మాణాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, మినీ ట్యాంక్ బండ్ల నిర్మాణాలు, బ్యాడ్మింటన్ కోర్టులు, నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణాలు, సెంట్రల్ లైటింగ్లు, మండలాల నుండి జిల్లా కేంద్రానికి రోడ్డు మార్గాన్ని సులభతరం చేసే దిశగా డబల్ రోడ్డులు, దేవాలయాల అభివృద్ధి మరియు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానన్నారు.
నియోజకవర్గంలోని సుల్తానాబాద్ మరియు పెద్దపల్లి పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అలాగే అమృత్ పథకం ద్వారా మంచి నీటి ట్యాంకులను నిర్మిస్తూ ప్రజల అవసరాలను తీస్తున్నామని గుర్తు చేశారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల నుండి నిట్టూరు, చందపల్లి మీదుగా అప్పన్నపేట వరకు 12 కిలో మీటర్ల మేరకు డబల్ లైన్ రోడ్డుతో పాటు సెంట్రల్ లైటింగ్ తో కూడిన బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఈరోజు పనులు ప్రారంభించుకోవడం ఆనందదాయకమన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రజలందరూ సహకరిస్తూ అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
