తెలంగాణకు కేసీఆర్ పరిపాలననే శ్రీరామరక్ష

తెలంగాణకు కేసీఆర్ పరిపాలననే శ్రీరామరక్ష

  • కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత
  • బీఆర్‌ఎస్‌లో చేరిన ఏర్గట్ల మండల నాయకులు

ఏర్గట్ల, ఆంధ్రప్రభ ; ఏర్గట్ల మండలంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శనివారం వేల్పూర్‌లోని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో మండల కాంగ్రెస్ నాయకులు సున్నపు అంజయ్య, జిట్టావోయిన రాజు, నాయుడు పోశెట్టి తమ అనుచరులతో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గులాబీ  కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు ఏళ్లు కావస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది.

రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడం, రైతుబంధు, బోనస్ వంటి పథకాల్లో నిర్లక్ష్యం వహించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, తెలంగాణకు కేసీఆర్ పరిపాలననే శ్రీరామరక్ష అని నమ్మి, ఆయనను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌లో చేరుతున్నాం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాజా పూర్ణనందం, ఏర్గట్ల సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ గుళ్ళే రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ మధుసుధన్,సొసైటీ చైర్మన్ బర్మా నర్సయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు దేవుడు నర్సయ్య,బద్దం ప్రభాకర్ రెడ్డి, కుశ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.