ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
- రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈఓ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా, వేగవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అడిషనల్ సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియపై సమీ నిర్వహించారు.
ఈ సమావేశంలో ఈఆర్వో, రాజేందర్, ఏడు మంది ఏఈ ఆర్వోఓలు, బీఎల్వో సూపర్వైజర్లు, బూత్ లెవల్ అధికారులు పాల్గొన్నారు. అదనపు సీఈఓ మాట్లాడుతూ 2025 ఓటరు జాబితాలోని అర్హులైన ప్రతి ఓటరును 2002 ఓటరు జాబితాతో అనుసంధానం చేసే ప్రక్రియను కచ్చితంగా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మ్యాపింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం గమనించామని, బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించి వేగవంతంగా మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియలో రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవల్ ఏజెంట్ల సహకారం తీసుకోవాలని, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
ఓటర్లలో వచ్చే ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని తెలిపారు. మరణించినా లేక బహుళ నమోదు ఉన్నా.. ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్లను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే వీవీఐపీ, వీఐపీ ఓటర్ల వివరాలను కూడా గుర్తించాలని సూచించారు. ప్రతి అర్హత గల ఓటరు తమ వివరాలను మ్యాపింగ్ చేయించుకునేలా సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఆర్డీవో గున్నాల రాజేందర్, మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
