శాప్ లో త్వరలో కోచ్‌ల భర్తీ..
శాప్ లో త్వరలో కోచ్‌ల భర్తీ..
కొత్తగా ఏర్పాటు కానున్న స్పోర్ట్స్ అకాడమీలు..
క్రీడా నిపుణుల నియామకం కోసం కసరత్తు.
13 హెడ్ కోచ్‌లు, 4 అసిస్టెంట్ కోచ్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం…
మే 5 నుంచి 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ..
రాష్ట్రంలో క్రీడా ప్రతిభ వికాసానికి ప్రభుత్వం కీలక అడుగు..
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. కొత్తగా ఏర్పాటు కానున్న స్పోర్ట్స్ అకాడమీల కోసం కోచ్‌ల నియామక ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ప్రారంభించింది. ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దే లక్ష్యంతో అనుభవం కలిగిన కోచ్‌ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కోచ్ ల నియామకం కోసం..
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న క్రీడా అకాడమీల్లో అవసరమైన కోచ్ లను నియమించనున్నారు. ఈ నియామకాల్లో భాగంగా మొత్తం 13 హెడ్ కోచ్ పోస్టులు, 4 అసిస్టెంట్ కోచ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్ తదితర క్రీడా విభాగాల్లో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేస్తూ యువ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
దరఖాస్తులను ఆహ్వానిస్తున్న శాప్…
కొత్తగా నియమించే కోచ్ ల కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుండి శాప్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. హెడ్ కోచ్ పోస్టులు మొత్తం 13 ఉండగా అథ్లెటిక్స్,బ్యాడ్మింటన్, బాక్సింగ్, సైక్లింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ,జూడో, ఖో-ఖో, లాన్ టెన్నిస్, రైఫిల్ షూటింగ్,వాటర్ స్పోర్ట్స్, ఒక్కొక్క పోస్టు ఉండగా
వెయిట్‌లిఫ్టింగ్ లో రెండు పోస్టులు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు వీరిని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోనున్నారు. అసిస్టెంట్ కోచ్ పోస్టులు మొత్తం 4 ఉండగా బ్యాడ్మింటన్, జూడో, లాన్ టెన్నిస్, రైఫిల్ షూటింగ్ ఒక్కొక్క పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
దరఖాస్తుల స్వీకరణ మే 5, నుంచి మే 11, వరకు కొనసాగనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు. ఎంపికైన కోచ్‌లు కొత్తగా ప్రారంభమయ్యే స్పోర్ట్స్ అకాడమీల్లో సేవలు అందిస్తూ రాష్ట్ర క్రీడా ప్రతిభను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో క్రీడలకు మరింత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను వెలికితీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టాలనే సంకల్పంతో అడుగులు వేస్తోంది. కోచ్‌ల నియామకం ద్వారా యువతలో క్రీడా చైతన్యం పెరగడంతో పాటు భవిష్యత్ ఛాంపియన్ల తయారీకి ఇది బలమైన పునాది కానుందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
