ఆధునిక వ్యవసాయమే లక్ష్యంగా రైతు వారోత్సవాలు

ఆధునిక వ్యవసాయమే లక్ష్యంగా రైతు వారోత్సవాలు

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ: రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, వారిని ఆధునిక వ్యవసాయం వైపు మళ్లించేందుకే ప్రభుత్వం ‘రైతు వారోత్సవాలు’ నిర్వహిస్తోందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. రైతు వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం, జుక్కల్ మండలం ఖానాపూర్ శివారులోని ఆయిల్ పామ్ క్షేత్రంలో నియోజకవర్గ స్థాయి రైతుల అవగాహన మరియు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

తక్కువ పెట్టుబడి – ఎక్కువ లాభం
ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి ఆయిల్ పామ్, ఇతర ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంట రైతులకు ఎంతో లాభదాయకమని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చని తెలిపారు. నాలుగు సంవత్సరాల తర్వాత దిగుబడి ప్రారంభమై, సుదీర్ఘ కాలం పాటు రైతుకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.

ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించాలి
సరిహద్దు నియోజకవర్గమైన జుక్కల్‌లో రైతులు ఎక్కువగా వర్షాధార పంటలపై ఆధారపడి ఉన్నారని, వారిని వాణిజ్య పంటల వైపు మళ్లించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ యాంత్రీకరణ, డ్రిప్ ఇరిగేషన్, ఇతర పథకాలపై రైతులకు సమగ్ర సమాచారం ఇచ్చి వారిని ప్రోత్సహించాలని సూచించారు.

ఆదర్శ రైతుకు సన్మానం
విస్తారంగా ఆయిల్ పామ్ సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలిచిన జుక్కల్ గ్రామ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్‌ను ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రతి రైతు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉద్యానవన, మార్కెటింగ్, వ్యవసాయ శాఖల అధికారులు, వివిధ గ్రామాల రైతులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.