భారత్ గ్యాస్ ఏజెన్సీని ముట్టడిస్తాం
భారత్ గ్యాస్ ఏజెన్సీని ముట్టడిస్తాం
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లపు శ్రీనివాసులు
అచ్చంపేట, ఆంధ్రప్రభ: అచ్చంపేట పట్టణంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై ఉద్రిక్తత నెలకొంది. సిలిండర్ బుక్ చేసుకున్న ప్రజలకు దాదాపు రెండు నెలలైనా సరఫరా చేయకపోవడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నల్లపు శ్రీనివాసులు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ఆయన ఆంధ్రప్రభ తో నేరుగా మాట్లాడుతూ .. భారత్ గ్యాస్ నిర్వహణపై తీవ్ర ఆరోపణలు చేశారు. పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సమయానికి సిలిండర్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. దళారుల ద్వారా గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని తమకు విశ్వసనీయ సమాచారం అందిందని పేర్కొన్నారు.ఇక గతంలో గోదాంపై నిర్వహించిన దాడిలో దాదాపు 300 సిలిండర్లలో అక్రమాలు వెలుగులోకి వచ్చినప్పటికీ, ఇప్పటివరకు నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరమని మండిపడ్డారు. అంతేకాకుండా హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం బహిర్గతమై అధికారులు అట్టి సిలిండర్లను జప్తు చేసుకున్నప్పటికీ నేటి వరకు వారిపై చర్య తీసుకోకపోవడం వల్ల భారత్ గ్యాస్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారని అన్నారు.
ప్రజల ఇబ్బందులను పట్టించుకోని అధికారుల వైఖరి బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా విచారణ చేసి వెంటనే చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారత్ గ్యాస్ ఏజెన్సీని ముట్టడిస్తాం అని నల్లపు శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లాస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని స్పష్టం చేశారు. ఇదే విషయమై లక్ష్మీ ప్రసన్న గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ గోపాల్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.
