ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు సన్నబియ్యంతో పాటు పోషక విలువలతో కూడిన ఆహారంను డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా కూటమి ప్రభుత్వం అందిస్తోంది. మెనూలో మార్పులతో ఎక్కువ మంది విద్యార్థులు భోజనం చేస్తున్నారు. భోజనం మరింత రుచికరంగా, శుచిగా వడ్డించేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విద్యార్థులకు అదనపు పోషకాహారం అందించే నిమిత్తం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో ప్రస్తుతం అమలులో ఉన్న రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని మరో మూడేళ్లు కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో 2026-29 కాలానికి విద్యార్థులకు రాగిజావ పంపిణీ కార్యక్రమం కొనసాగించేందుకు శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్‌తో విద్యాశాఖ ఎంవోయూ కుదుర్చుకుంది. శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ సహకారంతో రాగిజావ పంపిణీ కార్యక్రమం మార్చి 2023లో ప్రారంభమై, ఈ ఏడాది ఏప్రిల్‌తో కాలపరిమితి ముగిసింది. దీంతో ఈ పథకం పొడిగింపునకు చర్యలు చేపట్టింది.
• పథకం మరో మూడేళ్లు పొడిగింపు
• మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా పంపిణీ
• రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
• శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్‌తో విద్యాశాఖ ఒప్పందం
• మంత్రి లోకేష్ సమక్షంలో ఎంవోయూ
మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం ఏడాదికి రూ.1,850 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో జోన్‌ల వారీగా విద్యార్థులకు మెనూ అమలు చేస్తున్నారు. ఈ మెనూలో ఫోర్టిఫైడ్ ఫైన్ రైస్, వారానికి ఐదు సార్లు గుడ్డు, వారానికి మూడు సార్లు చిక్కీ అందిస్తున్నారు. అలాగే పోషకాహారంగా చిక్కీ లేని రోజుల్లో వారానికి మూడు సార్లు రాగిజావ అందిస్తున్నారు.
ఈ చర్యల ద్వారా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్, హాజరు శాతం పెంపు, డ్రాప్‌ఔట్స్ తగ్గింపు, పోషక స్థాయిల మెరుగుదల లక్ష్యంగా పెట్టుకున్నారు. విద్యార్థులకు హెల్త్ సప్లిమెంట్గా రాగిజావను పంపిణీ చేస్తున్నారు. 10 గ్రాముల రాగి పిండి, 10 గ్రాముల బెల్లం పొడిని 150 మిల్లీలీటర్ల వేడి నీటిలో కలిపి విద్యార్థులకు అందిస్తున్నారు. దీనివల్ల కాల్షియం, ఐరన్ సమృద్ధిగా లభించి పోషకాహారం మెరుగుపడుతుంది.
రాగిపిండి, బెల్లం పొడిని శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉచితంగా అందిస్తోంది. ట్రస్ట్ ద్వారా జిల్లా కేంద్రాల వరకు సరఫరా చేసి, అక్కడి నుంచి పౌర సరఫరాల శాఖ ద్వారా పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం మూడేళ్లలో సుమారు రూ.80 కోట్లు వెచ్చించనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే. రత్నాకర్, అడ్మిన్ కోఆర్డినేటర్ ఎస్.జి. చలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధ్యక్షులు ఆర్. లక్ష్మణరావు, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, అడిషనల్ డైరెక్టర్ ఆర్.ఎస్. గంగా భవాని పాల్గొన్నారు.
