Population 490 | జాతీయ స్థాయిలో మెరిసిన వెంకూర్..

Population 490 | జాతీయ స్థాయిలో మెరిసిన వెంకూర్..

ఆరోగ్య గ్రామపంచాయతీగా ఎంపిక

Population 490 | కుంటాల, ఆంధ్రప్రభ : ఐక్యరాజ్యసమితి లక్ష్యాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా గ్రామపంచాయతీల పనితీరును పరిశీలించగా.. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని వెంకూర్ గ్రామపంచాయతీ జాతీయ స్థాయిలో ఎంపికైంది. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే సూక్తిని వెంకూర్ గ్రామస్తులు నిజం చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ‘ఆరోగ్య గ్రామ పంచాయతీ’గా 91.33 స్కోర్ సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. పేదరిక నిర్మూలన, జీవనోపాధి, శిశు స్నేహపూర్వక పంచాయతీ, ఆరోగ్యమైన గ్రామం, నీటి సమృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం, సుపరిపాలన, మహిళా స్నేహపూర్వక పంచాయతీ వంటి అంశాలను అధికారులు పరిశీలించారు.

490 జనాభా వెంకూర్ ఒక చిన్న పల్లె. పక్కనే వాగు ఉంది. కిలోమీటర్ దూరంలో పునరావాస గ్రామం ఏర్పాటవుతోంది. 2018కి ముందు విట్టాపూర్ గ్రామపంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉండేది. గత ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడంతో వెంకూర్ నూతన గ్రామపంచాయతీగా అవతరించింది. ప్రస్తుతం గ్రామంలో 109 కుటుంబాలు, 490 జనాభా, 361 ఓటర్లు ఉన్నారు.

జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పంచాయతీ అభివృద్ధి సూచిక నివేదికలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల మండలం వెంకూర్ గ్రామానికి మొదటి స్థానం దక్కింది. పల్లె ప్రగతి గుణాంకాల్లో ప్రతి విభాగంలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం. వెంకూర్ ఆరోగ్య గ్రామ పంచాయతీగా ఎంపిక కావడానికి అధికారులు, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు స్థానిక వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తల సమన్వయమే కారణమని పలువురు పేర్కొంటున్నారు.

గ్రామంలో వైద్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తూ శిశు మరణాలను అరికట్టడం, ఆసుపత్రిలోనే డెలివరీలు, రక్తహీనత నివారణ వంటి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం వల్లే ఈ గ్రామం ఎంపికైంది. 100% వ్యాక్సినేషన్ గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో ప్రతిరోజూ ఇంటింటికీ తడి చెత్త, పొడి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నట్లు ఎంపీఓ అబ్దుల్ రహీం తెలిపారు. మండల స్థాయి అధికారులు ప్రతినిత్యం పర్యవేక్షిస్తూ గ్రామాన్ని ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేశారు.

100% వ్యాక్సినేషన్, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం వంటి అంశాల్లో వెంకూర్ ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. గ్రామంలో మంచినీటిని వృథా చేయకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో మాత్రమే వాడుకుంటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారు. 100% ఆరోగ్య బీమా కుటుంబాలు ఉండగా, అన్ని కుటుంబాలకు పథకాలు అమలయ్యేలా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

గ్రామానికి సమీపంలో అంబులెన్స్ సౌకర్యం కూడా ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడినవారు లేరు. నర్సరీ ద్వారా గ్రామంలో మొక్కలు నాటడం, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఉండటంతో నీటిని వృథా చేయరు. దీంతో అధికారులు సైతం ‘వెంకూర్ శభాష్’ అని ప్రశంసిస్తున్నారు. ఎంపీఓ అబ్దుల్ రహీం ప్రజల భాగస్వామ్యంతోనే నూతనంగా ఏర్పడిన వెంకూర్ గ్రామపంచాయతీని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా ఎంపిక చేసిందని ఎంపీఓ ఎం.ఏ. అబ్దుల్ రహీం తెలిపారు.

ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామంలోని మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సర్పంచ్ సిందే సవిత సమిష్టి కృషితో గ్రామ అభివృద్ధికి పాటుపడతానని సర్పంచ్ సిందే సవిత పేర్కొన్నారు.

వెంకూర్ గ్రామపంచాయతీ ఆరోగ్యమైన పంచాయతీగా ఎన్నిక కావడం హర్షణీయమన్నారు. గ్రామస్తులందరూ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అధికారుల ప్రోత్సాహం, సమిష్టి కృషి ఫలితంగా మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.