attack | హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు

attack | హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు

attack | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : భార్యతో వచ్చిన మనస్పర్థలు చివరకు అత్త ప్రాణాలు తీసిన విషాద ఘటన మేడ్చల్‌ జిల్లాలో వెలుగుచూసింది. భార్యపై కోపంతో అల్లుడు తన అత్తను బైక్‌పై తీసుకెళ్లి హెల్మెట్‌తో తలపై కొట్టి హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. అనంతరం ఫిట్స్‌ వచ్చి కిందపడటంతో ప్రమాదం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశాడు.

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్‌ జిల్లా చెంగిచర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన కొల్ల అరుణ (39)కు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె కావ్య (19) గత ఏడాది కరీంనగర్‌ చందన్‌పూర్‌కు చెందిన కర్రు స్నేహిత్‌ (28)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయి.

ఈ క్రమంలో గతనెల 29వ తేదీన రాత్రి అరుణకు స్నేహిత్‌ ఫోన్‌ చేసి, తన భార్యపై అసహనం వ్యక్తం చేశాడు. ‘నేను పెద్ద కంపెనీలో ఆఫీసర్‌ను.. నీ కూతుర్ని పెళ్లి చేసుకున్నా, కానీ చిన్న విషయాలకే అలుగుతుంది’ అంటూ కోప్పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

మరుసటి రోజు మధ్యాహ్నం అరుణ దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా స్నేహిత్‌ ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత కావ్యకు ఫోన్‌ చేసి, అత్తమ్మకు ఫిట్స్‌ వచ్చి బైక్‌పై నుంచి పడిపోయిందని, ఆస్పత్రికి తరలించానని చెప్పాడు. భర్త మాటలు నమ్మిన కావ్య వెంటనే ఆస్పత్రికి చేరుకోగా, అదే రోజు చికిత్స పొందుతూ అరుణ మృతిచెందింది. అయితే ఘటనపై అనుమానం వచ్చిన కావ్య సీసీ ఫుటేజ్‌ పరిశీలించగా, స్నేహిత్‌ హెల్మెట్‌తో అత్త తలపై దాడి చేసిన విషయం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.