Illegal-Boats : ఏపీటీడీసీ… సో పిటీ.. Andhra Prabha Top Story

Illegal-Boats : ఏపీటీడీసీ… సో పిటీ.. Andhra Prabha Top Story

  • అంతా ఇల్లీగలే
  • రిజిస్ట్రేష‌న్లు అడగొద్దు
  • అనుమ‌తి అక్కర్లేదు
  • బీమాతో పని లేదు
  • డొక్కు బోట్లు సవారీ
  • ప్ర‌మాదం జ‌రిగితే …
  • పోయేది జనం ప్రాణాలే
  • పేరుకు తొమ్మిది….
  • తిరిగేవి కొన్నే…
  • అవినీతి రాజ్యం…

(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ‌)

ప‌ర్యాట‌క శాఖ‌లో నిర్ల‌క్ష్య‌పు జాడ్యం రాజ్య‌మేలుతోంది. డొక్కు బోట్ల‌ను న‌దిలో న‌డుపుతుండ‌డంతో ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతోంది. ఎప్పుడు ఏ ప్ర‌మాదం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోవైపు అనుమ‌తులు లేని బోట్ల‌ను య‌థేచ్ఛ‌గా న‌దిలో న‌డుపుతూ నిబంధ‌న‌ల‌కు నీళ్లు వ‌దులుతోంది. బోట్ డ్రైవ‌ర్లు క‌నీసం లైఫ్ జాకెట్లు వేసుకోకుండా ఇష్టానుసారం బోట్లను న‌డుపుతూ ప‌ర్యాట‌కుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బో అర్థం కాని ప‌రిస్థితి నెల‌కొంది. ఇదీ భ‌వానీ ద్వీపం వ‌ద్ద ఏపీటీడీసీ నిర్వ‌హిస్తున్న బోటింగ్ తీరు. అధిక మొత్తంలో ఫీజులు వ‌సూలు చేస్తున్నా సౌక‌ర్యాల మాట దేవుడెరుగు క‌నీసం భ‌ద్ర‌తా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డ‌మేమిన్న ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది.

Illegal-Boats : అక్క‌డ అంతా ఇష్టారాజ్యం..

విజయవాడ లోని కృష్ణాన‌ది మ‌ధ్య‌లో ఉన్న భ‌వానీ ద్వీపం ప‌ర్యాట‌కుల స్వ‌ర్గ‌థామంగా ఉంది. దీనిని తిల‌కించేందుకు న‌గ‌ర‌వాసులే కాకుండా దేశ‌వ్యాప్తంగా క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే భ‌క్తుల‌సైతం భ‌వానీ ఐలాండ్‌ను ద‌ర్శించి ప‌ర్యాట‌కానుభూతిని పొందుతారు. దీంతో నిత్యం భ‌వానీ ద్వీపం సంద‌ర్శ‌కుల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. అయితే అక్క‌డ క‌నీస సౌక‌ర్యాలు మృగ్య‌మ‌వ్వ‌డంతో సంద‌ర్శ‌కుల రాక కూడా క్ర‌మేణా త‌గ్గుతోంది. ఇదిలా ఉండ‌గా బెరం పార్కు నుంచి భ‌వానీ ద్వీపం వెళ్లేందుకు ప‌ర్యాట‌కాభివృద్ధి సంస్థ బోట్ల‌ను నిర్వ‌హిస్తోంది. వివిధ ర‌కాల బోట్ల‌ను అందుబాటులో ఉంచింది. పార్కు నుంచి బోట్ల‌లో ద్వీపానికి తీసుకువెళ్లి మ‌ళ్లీ తీసుకువ‌చ్చేందుకు ఒక్కో వ్య‌క్తి నుంచి రూ. 120, పిల్ల‌ల‌కు 90 రూపాయ‌లు వ‌సూలు చేస్తోంది. అయితే పేరుకు 10 ర‌కాల బోట్లు ఉన్నాయంటూ ప్ర‌చారం చేసుకుంటున్నా ప్ర‌స్తుతం రెండు మూడు ర‌కాల బోట్ల‌నే వినియోగిస్తోంది. అయితే ఈ బోట్లు పాత‌వి కావ‌డంతో సంద‌ర్శ‌కుల భ‌ద్ర‌త కూడా ప్ర‌శ్నార్థ‌కంగా మారుతోంది.

Illegal-Boats : అనుమ‌తులు నిల్‌…

ఏపీటీడీసీ ఆధ్వ‌ర్యంలో భ‌వానీ ద్వీపం వెళ్లేందుకు ప‌ది ర‌కాల బోట్ల‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు పేర్కొంది. స్పీడ్ బోట్‌, జ‌ల‌జాక్షి, అమ‌రాపాలి, జ‌గ‌దాంబ‌, భ‌వానీ, బోదిసిరి, మైత్రి, వెన్నెల‌, విజ‌య‌ల‌క్ష్మి, రెండు ర‌కాల స్పీడ్ బోట్ల‌ను నిర్వ‌హిస్తోంది. అబ్బో చాలా ర‌కాలు ఉన్నాయ‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. హోట‌ల్ మెనూ చార్ట్లులో ఐట‌మ్స్ హోట‌ల్‌కు వెళ్లిన‌ప్పుడు లేని చందంగా సంద‌ర్శ‌కులు కోరిన సంద‌ర్భాల్లో మాత్రం ఆ బోట్లు ప‌నిచేయ‌డం లేదన్న స‌మాధానం వ‌స్తోంది. కేవ‌లం భ‌వానీ, ఏపీ బోట్ల‌ను మాత్రం ద్వీపానికి న‌డుపుతున్నారు. మిగిల‌న‌వి ఒడ్డునే సేద తీరుతుంటాయి. అదేమిటంటే సంద‌ర్శ‌కుల సంఖ్య‌కు అనుగుణంగా తిప్పుతామ‌న్న నిర్ల‌క్ష్య‌పు స‌మాధానం ఎదుర‌వుతోంది. ఇదిలా ఉండ‌గా మొత్తం 10 ర‌కాల బోట్లు ఉన్న‌ప్ప‌టికీ కొన్నిమాత్ర‌మే న‌డుస్తున్నాయి. వీటిలో కూడా వెన్నెల‌, విజ‌య‌ల‌క్ష్మి బోట్ల‌కు ఎటువంటి రిజిస్ట్రేష‌న్లు లేకుండా న‌దిలోకి న‌డుపుతున్నారంటే ప‌ర్యాట‌కుల ప్రాణాలంటే ఏపీటీడీసీ అధికారుల‌కు విలువ లేకుండా పోతుంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. క‌నీసం రిజిస్ట్రేష‌న్ లేని వాటిలో ప‌ర్యాట‌కుల‌ను ఎలా ఎక్కిస్తార‌న్న ప్ర‌శ్న ఉద్భ‌విస్తోంది. మిగిలిన బోట్ల జీవిత కాలం కూడా పూర్తికావ‌డంతో ప‌లుమార్లు మ‌ర‌మ్మ‌తుల‌కు గుర‌వుతున్నాయి. ఇటీవ‌ల వేల‌ల్లో ఖ‌ర్చు చేసే మ‌ర‌మ్మ‌తుల‌కు ల‌క్ష‌ల్లో బిల్లులు వేసి అధికారులు అవినీతికి తెర‌లేపార‌న్న ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి.

Illegal-Boats : భ‌ద్ర‌త డొల్ల‌…

కృష్ణ‌మ్మ అందాల‌ను ఆస్వాదిస్తూ బోటుపై విహ‌రిస్తూ అద్వితీయ‌మైన ఆనందం పొందే ప‌ర్యాట‌కుల భ‌ద్ర‌త‌ను ప‌ర్యాట‌క సంస్థ గాలికొదిలేసింది. నాణ్య‌త లేని బోట్ల‌ను తిప్పుతుండ‌డంతో అవి ఏ దిశ‌కు వెళ్తున్నాయో తెలియ‌ని స్థితి నెల‌కొంది. క‌నీసం బోట్లు న‌డిపే డ్రైవ‌ర్లు సైతం లైఫ్ జాకెట్లు వేసుకోకుండా ఇష్టానుసారం న‌డుపుతూ ప‌ర్యాట‌కుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నారు. చాలామంది ప‌ర్యాట‌కులు సైతం లైఫ్ జాకెట్లు వేసుకోక‌పోయినా సిబ్బంది ప్ర‌శ్నించ‌క‌పోవ‌డం విడ్డూరంగా ఉంది. ప‌ర్యాట‌కుల‌తో మ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించాల్సి ఉన్నా విసుక్కుంటూ వారితో అమ‌ర్యాద‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో ప‌లుమార్లు ఘ‌ర్ష‌ణ‌లు కూడా జ‌రిగాయ‌న్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

Illegal-Boats : రిజిస్ట్రేష‌న్లు లే వు

రెండు బోట్ల‌కు రిజిస్ట్రేష‌న్ లేకుండానే న‌దిలో తిప్ప‌డంపై సంద‌ర్శ‌కులు మండిప‌డుతున్నారు. అస‌లు రిజిస్ట్రేష‌న్ లేని బోట్ల‌కు ఇన్సూరెన్స్ చేయించామ‌ని అధికారులు చెబుతున్నారంటే వీరి ప‌నితీరు ఎలా ఉందో అవ‌గ‌త‌మ‌వుతోంది. ద్వీపానికి వెళ్తున్న సంద‌ర్భంలో ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే అందులో ప్ర‌యాణించే సంద‌ర్శ‌కుల‌తో పాటు బోటుకు ఇన్సూరెన్స్ ల‌భించే అవ‌కాశం ఉంటుంది. అయితే రిజిస్ట్రేష‌న్ లేని రెండు బోట్ల‌ను ఎటువంటి అనుమ‌తులు లేకుండా య‌థేచ్ఛ‌గా న‌దిలో తిప్పుతున్నా వీటికి కూడా ఇన్సూరెన్స్ చేయించామ‌ని అధికారులు చెప్ప‌డం విడ్డూరంగా ఉంద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇందులో కొన్ని బోట్ల‌ను ద్వీపంలో స‌రుకు ర‌వాణా కోసం వినియోగిస్తుంటారు. మిగిలిన‌వ‌న్నీ సంద‌ర్శ‌కుల కోసం ఉప‌యోగించాల్సి ఉన్నా అందుకు విరుద్ధంగా కేవ‌లం రెండు బోట్ల‌తోనే కాల‌క్షేపం చేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆయా బోట్ల డ్రైవ‌ర్లంతా ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇవ్వాల్సిన ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అస‌లు ఏపీటీడీసీలో ఏం జ‌రుగుతుందో తెలుసుకొనే తీరిక ఉన్న‌తాధికారుల‌కు లేకుండా పోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికైనా ఈ శాఖ ఉన్న‌తాధికారులు భ‌వానీ ద్వీపానికి పున‌ర్ వైభ‌వం తీసుకువ‌చ్చేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ప‌లువురు కోరుతున్నారు.